కేరళ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. దేశంలో కడు పేదరికాన్ని(extreme poverty) నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు దక్కించుకుంది. శనివారం ఆ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక ప్రకటన చేశారు. తద్వారా చైనా దేశం తర్వాత అలాంటి ఘనత పొందిన రెండో ప్రాంతంగా కేరళ నిలిచింది.
ఇది కేవలం గణాంకాల విషయం కాదు.. మానవీయ విజయం అంటూ శనివారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో పినరయి విజయన్ ప్రకటించారు.ఇవాళ(నవంబర్ 1న) “కేరళ పిరవి” (Kerala Piravi) దినోత్సవం(రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం). ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగ్గా.. పలువురు రాజకీయ, సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మేం చెప్పినదాన్నే అమలు చేశాం. వాస్తవాలు తెలియజేస్తున్నాం అంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టారాయాన. అయితే ప్రభుత్వ ప్రకటనను మోసపూరితంగా అభివర్ణిస్తూ ఈ సెషన్‌ను ప్రతిపక్షాలు బహిష్కరించాయి.
2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే “అత్యంత పేదరిక నిర్మూలన” లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లే.. 4 లక్షల మంది ఎన్యూమరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి 1,03,099 మంది అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక మైక్రో ప్లాన్ రూపొందించి.. కుడుంబశ్రీ(కుటుంబశ్రీ), స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమ శాఖ కలిసి అమలు చేశాయి.
చైనా తర్వాత కేరళనే.. 2019లో అత్యంత దుర్భర పేదరికం నిర్మూలించిన దేశంగా చైనా నిలిచింది. ప్రపంచ బ్యాంక్, UNDP, మరియు చైనా ప్రభుత్వ నివేదికలు ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత.. ఇప్పుడు కేరళ ఆ ఘనత సాధించడం గమనార్హం. ప్రతి వ్యక్తికి ఆహారం, నివాసం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాథమిక అవసరాలు అందుతున్నాయని కేరళ ఈ సందర్భంగా ప్రకటించుకుంది.
కేరళ రాష్ట్రం భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాక, దేశంలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా, పూర్తిగా విద్యుతీకరణ పొందిన రాష్ట్రంగా కూడా నిలిచింది. ఇప్పుడు.. అత్యంత దుర్భర పేదరికం (extreme poverty) నిర్మూలనలో భారతదేశంలో తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది.


