
స్టేడియాల నిర్మాణాలు..నత్తతో పోటీ!
కల్లూరు: జిల్లాలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించేందుకు రూ 2.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు తీసుకుంది.
– నియోజకవర్గానికి ఓ స్టేడియం చొప్పున 14 మంజూరు
– 6 నియోజకవర్గాల్లో స్థలం, ఇతర సమస్యలతో వెనక్కి
– ఎనిమిదింటిలో డోన్, గూడూరు ప్రారంభం
కల్లూరు: జిల్లాలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించేందుకు రూ 2.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్యలు తీసుకుంది. కర్నూలు నగరంలో క్రీడా భవనం, ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు రూ 6.75 కోట్లు నిధులు విడుదల చేసింది. టెండర్ల ప్రక్రియ ద్వారా 2016 మార్చి నెలలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా కలెక్టర్, శాప్ అధికారులు మధ్యలో తనిఖీలు నిర్వహిస్తూ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు సదరు కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వాటి నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. 14 నియోజకవర్గాల్లో ఆరింటిలో స్థల, ఇతర సమస్యలతో నిధులు వెనక్కిపోగా, మిగిలిన 8 కేంద్రాల్లో నిర్మాణాలు చేపట్టారు. ఎట్టకేలకు 4నెలల ఆలస్యంగానైనా గూడూరు, డోన్ కేంద్రాల్లో మాత్రమే స్టేడియాలు నిర్మితమై ప్రారంభానికి నోచుకున్నాయి.
పూర్తయ్యేదెన్నడో..
కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, ఆలూరు, పత్తికొండలలో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికి పూర్తవుతాయోనని క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు. ఈ నిర్మాణాలకంటే నత్తే వేగంగా నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు నగరంలో నిర్దేశించిన సమయం కన్నా ఆరునెలలు ఆలస్యమైంది. ఎట్టకేలకు క్రీడా భవనం పూరై ్తనా టాయ్‌లెట్స్ నిర్మాణాల నుంచి మురుగు నీటి పైపులైన్ భవనం బయటకు ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి మున్సిపల్ ప్రాంతంలోని కాలువకు కనెక్షన్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిస్పోజల్ కాలువ లేకుండా సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. అలాగే ఇండోర్ స్టేడియంలో గ్రావెల్ వేయించారు. గరండాలతో పైకప్పు ఏర్పాటుచేశారు. మిగిలిన పనులు ఒక ఇంచు కూడా ముందుకు కదలడం లేదు. ఇప్పటికే ఆరు నెలలు ఆలస్యమైంది. మరో మూడు నెలలు సమయం ఇచ్చినా నిర్మాణాలు పూర్తి చేసేటట్లు కనిపించడం లేదు. ఇంకా స్టేడియం ముందు భాగానా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లభించలేదు. పలు క్రీడలకు కోర్టు ప్రాంగణాల ఏర్పాటుచేయల్సివుంది. సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ఇంకా ప్రతిపాదనల వద్దే పురోగతి నిలిచింది.
కాంట్రాక్టర్‌తో మాట్లాడి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా: మల్లికార్జున, ఇన్‌చార్జ్ డీఎస్‌డీఓ
నేను బాధత్యలను ఇటీవలే తీసుకున్నాను. నిర్మాణాలను ఒకసారి తనిఖీ చేసి పనులు ఎక్కడ ఎందుకు నిలిచిపోయాయో తెలుసుకుని కాంట్రాక్టర్‌తో మాట్లాడతాను. అవసరమైతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను.