టీడీపీలో సెల్‌ఫోన్ల సంక్షిప్త సందేశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఆగంతకుని నుంచి బెదిరింపు మెసేజ్ వస్తుందో అంతుబట్టడం లేదు.
– ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు
– తాజాగా ఎమ్మెల్యే సూరికి రావడంపై చర్చ
అనంతపురం సెంట్రల్ : టీడీపీలో సెల్‌ఫోన్ల సంక్షిప్త సందేశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఆగంతకుని నుంచి బెదిరింపు మెసేజ్ వస్తుందో అంతుబట్టడం లేదు. ఇప్పటికే అనంతపురం మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికు ఇటువంటి సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. వీరు ఎస్పీ రాజశేఖర్‌బాబును కలసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీని గురువారం కలవడం చర్చనీయాంశమైంది. ఆయన రాకతో పోలీసు వర్గాల్లోనూ చర్చ సాగింది. ఆయనకూ బెదిరింపు మెజేస్ వచ్చిందా లేక ఇతర సమస్యపై ఎస్పీని కలిశారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే మరికొందరు టీడీపీ ముఖ్య నేతలు ఎస్పీ రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయ అధికారులు మాత్రం నేతల రాకపై నోరు మెదపడం లేదు. అత్యంత రహస్యంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అన్ని విషయాలు బయటపెడితే పార్టీ పరువు బజారును పడుతుందనే ధోరణిలో ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య ప్రజాప్రతినిధులకు బెదిరింపుల మెసేజ్‌లు వచ్చి రోజులు గడుస్తున్నా ఏం జరుగుతోందో.? ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా బయట పెట్టలేకపోవడం పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.