సర్‌చార్జ్‌! | sircharge | Sakshi
Sakshi News home page

సర్‌చార్జ్‌!

Jan 9 2017 11:28 PM | Updated on Sep 5 2017 12:49 AM

సర్‌చార్జ్‌!

సర్‌చార్జ్‌!

‘ప్రజలంతా డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్స్‌ వైపు మళ్లాలి.. నగదు రహిత విధానంతో చిల్లర సమస్య ఉండదు. నగదు కొరత అసలే ఉండదు.’ ఇవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్న మాటలు.

  స్వైప్‌ చేస్తే నగదు స్వీపే..
– రూ. 100కు రూ. 11.50 వసూలు
– వినియోగదారులకు భారం
– పెట్రోల్‌ బంకుల్లో అయోమయం..
 
‘ ఎమ్మిగనూరుకు చెందిన రఘువీర్‌  ఈనెల 4న రూ.15,844ల డీజిల్‌ వేయించుకొని అమౌంట్‌ను స్వైప్‌ మిషన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అరగంట తర్వాత తన అకౌంట్‌ నుంచీ పైమొత్తంతోపాటు రూ.455.52 డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది.’
 
‘‘ ఆలూరు నియోజకవర్గంలో పనిచేసే వ్యవసాయాధికారి పాపిరెడ్డి ఎమ్మిగనూరు పెట్రోల్‌ బంకులో రూ.100లు పెట్రోల్‌ను స్వైప్‌ద్వారా వేయించుకొన్నాడు.అతని బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.100తోపాటు రూ.11.50లు అదనంగా డెబిట్‌ అయ్యింది.’
 
ఎమ్మిగనూరు :  ‘ప్రజలంతా డిజిటల్‌ ట్రాన్సాక‌్షన్స్‌ వైపు మళ్లాలి.. నగదు రహిత విధానంతో చిల్లర సమస్య ఉండదు. నగదు కొరత అసలే ఉండదు.’ ఇవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్న మాటలు. ఇందుకోసం ప్రభుత్వం ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన సద్సులు కూడా నిర్వహిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో చాలా మంది గత్యంతరం లేక నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపారు.
 
బాదుడే.. బాదుడు..
అయితే డిసెంబర్‌ 31 తర్వాత ఆంక్షలు ఎత్తివేయటంతో సర్‌చార్జీల పేరుతో వినియోగదారులను బాదేస్తున్నారు. స్వైప్‌ ద్వారా పెట్రోల్‌ బంకుల్లో లావాదేవీలు జరిపే వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పెట్రోల్‌ బంకుల్లో రూ.100లు ఇంధనానికి రూ. 11.50లు చార్జీ వసూలు చేస్తున్నారు. స్వైప్‌ చేసినప్పుడు రూ.100 మాత్రమే చూపుతున్నా తర్వాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో రూ.11.50 డెబిట్‌ అవుతోంది. అదే విధంగా ఇతర వ్యాపారులు స్వైప్‌ మిషన్లు వాడితే వినియోగదారుడిపై కాకుండా షాపు యజమానులకు సర్‌చార్జి పడుతోంది. కిరాణా కొట్టులో రూ.100లు బిల్లు చేసి స్వైప్‌ చేస్తే షాపు యజమాని ఖాతాలో రూ.92లు మాత్రమే జమవుతుంది. అదేవిధంగా వినియోగదారుడిపై రూ.2.8 శాతం అదనంగా చార్జిలు పడుతున్నాయి.
 
బంక్‌లు, బ్యాంకుల మధ్య వార్‌..
ఈ నెల 1 నుంచి 8 వరకు ప్రతి ట్రాన్సాక‌్షన్‌పై రూ. 11.50లు వినియోగదారులపై సర్‌చార్జిలు వసూలు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రతి లావాదేవీలపైనా పెట్రోల్‌ బంక్‌ యజమానులకు కూడా 1 శాతం ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌) చార్జీలను వర్తింపజేస్తుండడంతో అందరూ ఏకమయ్యారు. పెట్రోల్, డీజిల్‌ బంక్‌ల్లో సోమవారం నుంచి క్రికెట్, డెబిట్‌ కార్డులకు అనుమతించేది లేదంటూ బోర్డులు పెట్టారు. అయితే ఉన్నత స్థాయిలో జరిగిన చర్చల మేరకు ఈనెల 13 వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం వ్యాపారులపై 1 శాతం సర్‌చార్జి పడుతుంటే అందరూ ఏకమై నిర్ణయాలు తీసుకుంటున్నారు.‘ అయితే వినియోగదారుడిపై ఏకంగా రూ. 11.50  ప్రతి లావాదేవీలపై అదనంగా పడుతున్నా స్పందించే వారు కరువయ్యారు.
  
వ్యాపారాలపై దెబ్బ 
నగదు రహిత లావాదేవీలతో వ్యాపారులు వృద్ధి చెందుతాయనుకున్నాం. కానీ రూ.100లు పెట్రోల్‌ పోసుకొనే వినియోగదారుడిపై రూ.11.50లు అదనంగా చార్జీలు పడుతుంటం బాధనిపించింది. ఇప్పుడు ఏకంగా మాపై కూడా 1 శాతం సర్‌చార్జీలు వేస్తామని నోటీసులు పంపారు. ఈనెల 13 వరకు నిర్ణయం వాయిదా వేసుకొన్నారు. ఇలా జరిగితే వ్యాపారాలపై దెబ్బ పడుతుంది. -జి.ఎం. మహేంద్ర, పెట్రోల్‌ బంకు యజమాని
 
చార్జీలు తప్పని సరి  
నగదు రహిత లావాదేవీలపై 2016 డిసెంబర్‌ 31 వరకు మాత్రమే ఆంక్షలు ఉండేవి. జనవరి 1 నుంచి పెట్రోల్‌ బంకుల్లో జరిగే లావాదేవీలపై వినియోగదారుడిపై రూ. 11.50లు చార్జీలు పడతాయి. ఇతర వ్యాపారాల్లో వ్యాపారులకు 8 శాతం వరకు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనలను మార్చలేం. – కిరణ్, ఎస్‌బీఐ స్వైప్‌ మిషన్‌ రీజినల్‌ ఇంచార్జి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement