సీలేరు విత్తు.. కాలువలు చిత్తు | SEELERU SEED.. CANALS SPOILED | Sakshi
Sakshi News home page

సీలేరు విత్తు.. కాలువలు చిత్తు

Mar 26 2017 12:46 AM | Updated on Sep 5 2017 7:04 AM

సీలేరు విత్తు.. కాలువలు చిత్తు

సీలేరు విత్తు.. కాలువలు చిత్తు

ఏటా రెండో పంటలో సీలేరు జలాలే డెల్టా రైతులను ఆదుకుంటున్నాయి. అవే జలాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి..

ఏటా రెండో పంటలో సీలేరు జలాలే డెల్టా రైతులను ఆదుకుంటున్నాయి. అవే జలాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. రాకాసి విత్తుల్ని కాలువ గర్భాల్లో విరజిమ్ముతున్నాయి. ఆ విత్తులు కాలువల్లో నాటుకుపోయి పెద్దఎత్తున కర్రనాచు, తూడు మొలుస్తున్నాయి. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారి అన్నదాతలకు, జల వనరుల శాఖకు అగ్నిపరీక్షగా మారుతున్నాయి. వీటిని నివారించలేక యంత్రాంగం చేతులెత్తేస్తుండటంతో చేలకు సాగునీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. పట్టించుకోవాలి్సన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.
 
పెనుమంట్ర : సీలేరు జలాలతోపాటు కొట్టుకొస్తున్న కర్రనాచు, తూడు నిర్మూలించలేని స్థాయికి పెరిగిపోయాయి. దీనివల్ల ప్రధాన కాలువలతోపాటు బ్రాంచి కెనాల్స్, పంట కాలువల్లో నీటి ప్రవాహం ముందుకు సాగటం లేదు. ఫలితంగా చేలకు సాగు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టి కాలువలను కొంతమేర ప్రక్షాళన చేసిన అధికారులు కర్రనాచు వల్ల తలెత్తుతున్న సమస్యను ఎలా నివారించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు డెల్టాలోని శివారు భూములకు కీలక దశలో సాగునీరు అందక వరిచేలు నెర్రలు తీస్తున్నాయి. నీటి ప్రవాహానికి పైభాగంలో అడ్డు తగులుతున్న తూడును రైతులు, జల వనరుల శాఖ కొంతమేరకు తొలగిస్తున్నా.. కాలువ అట్టడుగున దట్టంగా పెరుగుతూ ప్రవాహానికి ఆటం కం కలిగిస్తోంది. ఇలాంటి అత్యవసర సమయంలో చేలకు సాగునీరు అందించేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. 
 
ఏ కాలువలో చూసినా..
జిల్లాలో విజ్జేశ్వరం వద్ద మొదలయ్యే పశ్చిమ డెల్టా కాలువతో కలుపుకుని జిల్లాలో 11 ప్రధాన పంట కాలువలున్నాయి. 357 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటికి అనుబంధంగా 2,200 కిలోమీటర్ల మేర మైనర్, బ్రాం చ్‌ కెనాల్స్, పంట బోదెలు ఉన్నాయి. వీటిద్వారా డెల్టాలోని పంట భూములకు రెండు పంటల్లో కలిసి 100 టీఎం సీల నీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రధాన కాలువలు సహా అన్నిటిలోనూ అడుగడుగునా కర్రనాచు, తూడు దట్టంగా పెరిగిపోయాయి. భారీగా నిధులు కేటాయిస్తే తప్ప ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించే పరిస్థితి లేదు.
 
చదరపు మీటరుకు రూపాయి పావలా
తూడు తొలగింపు పనులకు జల వనరుల శాఖాధికారులు అరకొర నిధులే కేటాయిస్తుండటంతో సమస్య పరిష్కా రం కావడం లేదు. కాలువల్లో తూడు తొలగింపునకు పూర్వం నిర్దేశించిన ధరలే నేటికీ అమలులో ఉన్నాయి. చదరపు మీటరు పరిధిలో తూడు, వ్యర్థాల తొలగింపునకు రూ.1.25 పైసలు మాత్ర మే కేటాయిస్తున్నారు. దీంతో పనులు చేయలేమంటూ జల వనరుల శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. 
 
ఏటా ఇంతే..
20 ఏళ్లుగా గోదావరి నదిలో దాళ్వా సీజ¯ŒSలో నీటి ప్రవాహం గణనీయంగా పడిపోతోంది. ప్రవాహ జలాలు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. అప్పటి నుంచి సీలేరు జలాలే ఇక్కడి రైతులను ఆదుకుంటున్నాయి. అవే జలాలు కర్రనాచు విత్తును కూడా మోసుకొస్తున్నాయి. ఆ విత్తు మొలకెత్తి కర్రనాచు దట్టంగా పెరగడానికి ఇక్కడి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కాలువల నిర్వహణను ప్రభుత్వం అలక్ష్యం చేయడం.. రైతువారీ వ్యవస్థలోనూ మార్పులు రావడంతో సమస్య తీవ్రమవుతోంది. వంతులవారీ విధా నం వల్ల కాలువల్లో నిత్యం నీటి ప్రవా హం ఉండటం లేదు. కొన్ని రోజులు మాత్రమే నీరిస్తుండటంతో వంతు పూర్తయ్యాక కాలువలో చెమ్మ మిగులుతోంది. దీనివల్ల సీలేరు జలాలతో కలిసి వచ్చిన కర్రనాచు, తూడు విత్తులు మొలకెత్తుతున్నాయి. వాటికి సూర్యరశ్మి బాగా అందుతుండటంతో వేగంగా పెరిగి దట్టంగా అల్లుకుపోతున్నాయి. దీని నివారణకు కలుపు నివారణ మందులు పిచికారీ చేసినా మొక్క చావడం లేదు. విత్తులు చేరిన మట్టిని తొలగిస్తే తప్ప కర్రనాచు, తూడును పూర్తిగా నివారించలేని పరిస్థితి.
 
ఇదేదో చిన్న సమస్య కాదు
కర్రనాచు సమస్య చూడటానికి చిన్నదే అనిపించవచ్చు. కానీ.. దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటోంది. సక్రమ సాగునీటి ప్రవాహం కోసం, పంటల సంరక్షణ కోసం దీనిని సంపూర్ణఃగా ప్రక్షాళన చేయడం ఎంతో అవసరం. లేదంటే భవిష్యత్‌లో వరి పొలాలకు సాగునీరు చేరకుండా ఇదే ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ప్రభుత్వం దీని సమూల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి.
– గ«ంధం వెంకట్రాజు, నీటి సంఘాల డీసీ చైర్మన్, మార్టేరు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement