
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలోని చెన్నూరు పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నంద్యాల ఈశ్వరయ్య(32) అనే వ్యక్తి మృతి చెందాడు.
– ఒకరు మృతి
చెన్నూరు : కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలోని చెన్నూరు పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నంద్యాల ఈశ్వరయ్య(32) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మండలంలోని శివాల్‌పల్లెకు చెందిన నంద్యాల ఈశ్వరయ్య ఫెర్టిలైజర్ కంపెనీలో ఏజెంటుగా పని చేస్తూ, స్థానికంగా వ్యవసాయం చేసుకుని జీవించేవాడు.అదే గ్రామానికి చెందిన ఆదివెంకటరమణ(26) అనే వ్యక్తితో కలిసి బైకుకు పెట్రోల్ పట్టించుకొనేందుకు చెన్నూరుకు వచ్చారు. పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు దాటుతుండగా కడప డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళుతూ బైకును ఢీకొంది. దీంతో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా, రమణకు గాయాలయ్యాయి. ఇద్దరిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈశ్వరయ్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య అయ్యవారమ్మ, 3 ఏళ్ల కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును, బైకును స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.