ప్రజా చైతన్యం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో వేళ్లూనుకుపోయిన ధనస్వామ్య రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వామపక్షాల నేతలు అన్నారు.
ధన రాజకీయాలకు చరమగీతం
Aug 18 2016 12:54 AM | Updated on Sep 17 2018 5:18 PM
కర్నూలు(అర్బన్): ప్రజా చైతన్యం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో వేళ్లూనుకుపోయిన ధనస్వామ్య రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వామపక్షాల నేతలు అన్నారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయలం సీఆర్ భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు అధ్యక్షతన సీపీఐ, సీపీఎం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.జగన్నాథం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో 98 శాతం కోటీశ్వరులే ఎన్నిక అవుతున్నందున దనవంతులు, బడా పారిశ్రామికవేత్తలకే పెద్ద పీట వేస్తు, సామాన్యులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే ప్రజా ప్రతినిధులు చట్టసభలకు ఎన్నిక కావడం లేదన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి కుంభకోణాల్లో కూరుపోతున్నా, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సదస్సుల్లో భాగంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో త్వరలోనే సదస్సును నిర్వహిస్తామన్నారు.
Advertisement
Advertisement