లచ్చయ్యపేట వద్ద రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు
అనుమతుల్లేవు. అడిగేవారు లేరు.. అంతకన్నా కావలసింది ఇంకేముంది. అందుకే పచ్చని పంట భూముల్లో ప్లాట్లు వేస్తున్నారు. అనధికారికంగా రియల్ వ్యాపారం సాగిస్తున్నారు. అడ్డూఅదుపూ లేని సీ‘రియల్’పై లోకాయుక్తకు ఫిర్యాదుల పరంపర మొదలైంది. ఉన్నతస్థాయిలో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది.
పంట పొలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం
పంచాయతీల అనుమతి లేకుండా ప్లాట్లు
లోకాయుక్త, కలెక్టర్‌కు ఫిర్యాదులు
అనుమతుల్లేని లేఅవుట్లపై దర్యాప్తు
సీతానగరం: అనుమతుల్లేవు. అడిగేవారు లేరు.. అంతకన్నా కావలసింది ఇంకేముంది. అందుకే పచ్చని పంట భూముల్లో ప్లాట్లు వేస్తున్నారు. అనధికారికంగా రియల్ వ్యాపారం సాగిస్తున్నారు. అడ్డూఅదుపూ లేని సీ‘రియల్’పై లోకాయుక్తకు ఫిర్యాదుల పరంపర మొదలైంది. ఉన్నతస్థాయిలో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. మరిపివలస నుంచి లచ్చయ్యపేట వరకూ రాష్ట్రీయ రహదారిని అనుకున్న వ్యవసాయ భూముల్లో అనధికారికంగా రియల్ వ్యాపారాలు చేసున్న వారిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త, కలెక్టరేట్‌లో ఫిర్యాదులు వెల్లువెతున్నాయి. పంట భూముల్లో రియల్ వ్యాపారాలు చేయాలంటే ముందు పంచాయతీ అనుమతి తీసుకోవాలి. రెవెన్యూ శాఖ నుంచి సాయిల్ కన్వర్షన్ చేయించాలి. ఆ తర్వాతే ప్లాట్‌లు వేసి అమ్మాలన్న మార్గ దర్శకాలున్నాయి. కానీ ఎలాంటి అనుమతుల్లేకపోయినా కొందరు నేతలు రాజకీయ పలుకుబడితో జోగింపేట, గుచ్చిమి, చిన్నారాయుడు పేట, కాశీపేట, చినబోగిలి, అంటిపేట, లచ్చయ్యపేట, మరిపివలస, రంగంపేట, వెంకటాపురం(ఏ) తదితర ‡గ్రామాల్లో పచ్చని పంట భూముల్లో రియల్ వ్యాపారం ప్రారంభించారు. ఎకరాల వంతున భూములను టోకెన్ అడ్వాన్స్‌పై కొనుగోలు చేశారు. చదరపు గజాల వంతున రాళ్లు పాతి ప్లాట్ల రూపంలో అమ్మేస్తున్నారు. జిరాయితీ భూములను ఆనుకున్న ప్రభుత్వ గోర్జీలు, డీపట్టా భూముల విక్రయాల కూడా మొదలయ్యాయి. దీనిపై బాధితులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో అధికారులు గుట్టుచప్పుడు లేకుండా దర్యాప్తు చేస్తున్నారు.
రియల్ భూములపై దర్యాప్తు – బి.సత్యనారాయణ, తహసీల్దార్, సీతానగరం
మండలంలోని వివిధ గ్రామాల్లో అనుమతులు లేకుండా 11 లేఅవుట్లు వేసినట్టు ప్రభుత్వ దష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల సూచనల మేరకు రియల్ భూములపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికి 9 ప్రాంతాల్లో దర్యాప్తు పూర్తయింది.
అనుమతి లేని వెంచర్లను గుర్తించాం – ఎం.పార్థసారధి, ఈవోపీఆర్డీ, సీతానగరం
పంట భూములను ఇళ్ల స్థలాలుగా మర్పు చేయాలంటే పంచాయతీల అనుమతులు తీసుకోవాలి. అలాంటి అనుమతుల్లేకుండా వెంచర్లు వేసిన భూముల యజమానులకు పంచాయతీల నుంచి నోటీసులు ఇచ్చాం.