కరువు నేపథ్యంలో రైతులు ఆర్థికంగా చితికిపోయారని, ఈ సమయంలో రుణాలు చెల్లించాలంటూ
ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కరువు నేపథ్యంలో రైతులు ఆర్థికంగా చితికిపోయారని, ఈ సమయంలో రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు చిత్రహింసలకు గురిచేస్తుండడం దారుణమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కలెక్టర్ రఘునందన్‌రావును కలిసి జిల్లాలోని కరువు పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఒకేదఫాలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మూగజీవాలకు తాగునీరు లేక మృత్యువాత పడుతున్నాయని, గతంలో ఒక్కో గ్రామంలో వెయ్యికిపైగా ఉన్న జీవాల సంఖ్య ఇప్పుడు వందలోపు పడిపోయిం దన్నారు. వెంటనే పశువులకు తాగునీరు, గ్రాసం ఉచితంగా పంపిణీ చేయచాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా తాగునీటికి కటకట ఉన్న గ్రామాల్లో అద్దెబోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో జేఏసీ జిల్లా కన్వీనర్ చల్మారెడ్డి తదితరులున్నారు.