బ్యాడ్‌ పోలీస్‌! | pressure comes, the cases do not care | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ పోలీస్‌!

Jul 26 2017 1:39 AM | Updated on Sep 5 2017 4:51 PM

బ్యాడ్‌ పోలీస్‌!

బ్యాడ్‌ పోలీస్‌!

‘ఎర్ర చందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దు రాష్ట్రం నుంచి బియ్యం స్మగ్లింగ్‌ ఏమాత్రం ఆగటం లేదు.

ఒత్తిడి వస్తే తప్ప కేసుల్ని పట్టించుకోని వైనం
పేకాట, ఎర్రచందనం, బెట్టింగ్‌ దందాల వెనుక ఖాకీల హస్తం
దిగువ నుంచి డీఎస్పీ వరకు ముడుపులు
వేలాదిగా పెండింగ్‌ కేసులు
23 మందికి ఏకకాలంలో చార్జి మెమోలు


నెల్లూరు : ‘ఎర్ర చందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దు రాష్ట్రం నుంచి బియ్యం స్మగ్లింగ్‌ ఏమాత్రం ఆగటం లేదు. ఇసుక అక్రమాలకు అడ్డే లేదు. పేకాట స్థావరాలు, బెట్టింగ్‌ రాకెట్, మట్కా కార్యకలాపాలు.. నిషేధిత గుట్కా విక్రయాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా కిడ్నాప్‌ కేసులు, బంగారం చోరీ వంటి కేసులు వేల సంఖ్యలో పెండింగ్‌ పడ్డాయి. అరాచకం రాజ్యమేలుతోంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. మనం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా..’ ఇటీవల నిర్వహించిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో నూతన ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆగ్రహంతో అన్న మాటలివి. 10 గంటల పాటు ఏకబిగిన సమావేశం సాగింది. ఆ వెంటనే 23 మంది పోలీసు  అధికారులకు చార్జి మెమోలు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా పోలీస్‌ విభాగంలో చర్చనీయాంశంగా మారింది.

ఒత్తిళ్లు వస్తే తప్ప..
జిల్లా పోలీస్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సై స్థాయి నుంచి ఏఎస్పీ స్థాయి అధికారి వరకు 23 మందికి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఏకకాలంలో చార్జి మెమోలు జారీ చేశారు. ఏదైనా దుమారం చెలరేగడం లేదా పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తే తప్ప పోలీసులు స్పందించరనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ రామకృష్ణ పోలీసుల పనితీరు, వాళ్లు సాగిస్తున్న మామూళ్ల వ్యవహారం తదితర అంశాలపై దృష్టి సారించారు. అసాంఘిక శక్తులపైనా వరుస కేసులు నమోదు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ప్రత్యక్షంగా ఎస్పీ రంగంలోకి దిగి కేసులు నమోదు చేయిస్తుండటం కిందిస్థాయి అధికారులకు కొంత ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి పోలీస్‌ శాఖలో దిగువస్థాయి నుంచి అధికారి వరకు ప్రతినెలా వివిధ రూపాల్లో మామూళ్లు వసూలు చేయడంతోపాటు పైస్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వ్యక్తిగత పనులు చేయించటం జిల్లాలో పరిపాటిగా ఉంది.

ఇప్పుడు మద్యం మొదలుకొని ఎర్రచందనం, ఇసుక, బెట్టింగ్‌ వంటి అన్ని వ్యవహారాలపై ఎస్పీ సీరియస్‌గా వ్యవహరిస్తుండటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. మామూళ్ల వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయో, ఎవరి పేర్లు ఉంటాయో అన్న ఆందోళనతో ఉన్నారు. తాజాగా క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాల్లో కీలక వ్యక్తి కృష్ణసింగ్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో అనేక మందికి సన్నిహిత సంబధాలు ఉన్నాయని, అధికారులకు, కొందరు వ్యక్తులకు భారీగా సొమ్ములిచ్చాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిందిస్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు కొందరు అతని నుంచి సొమ్ములు తీసుకున్నారన్న విషయం బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో సింగ్‌ కేసు ముగింపు ఎలా ఉంటుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

కీలక కేసులూ పెండింగే..
ఇతర కీలక కేసుల విషయంలో నూ పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2,600 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో కొన్ని కీలక కేసుల నూ మరుగున పడేశారు. ముఖ్యం గా నాలుగు కిడ్నాప్‌ కేసుల మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. బంగారం చోరీ కేసులు సైతం పదుల సంఖ్యలో మరుగునపడ్డాయి. వీటి సంగతి తేల్చాలని ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement