అప్పుల ‘ఉచ్చు’ | prasad suside with Debt trap | Sakshi
Sakshi News home page

అప్పుల ‘ఉచ్చు’

Aug 31 2016 11:34 PM | Updated on Sep 4 2017 11:44 AM

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న యువ రైతు ఈసాల ప్రసాద్‌

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న యువ రైతు ఈసాల ప్రసాద్‌

అప్పుల బాధ ఆ రైతు ప్రాణాలు తీసింది. మాణిక్యారం పంచాయతీ కోయగుంపులో ఈసాల ప్రసాద్‌ (33) అనే యువరైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పుట్టిన నాడే తండ్రి తనువు చాలించడం కలిచివేసింది.

కూతురు పుట్టిన రోజు నాడే యువరైతు ఆత్మహత్య
కారేపల్లి:
    అప్పుల బాధ ఆ రైతు ప్రాణాలు తీసింది. మాణిక్యారం పంచాయతీ కోయగుంపులో ఈసాల ప్రసాద్‌ (33) అనే యువరైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పుట్టిన నాడే తండ్రి తనువు చాలించడం కలిచివేసింది. ప్రసాద్‌ తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పత్తి, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. మూడేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రాక పోవడంతో రూ.4 లక్షలు అప్పయింది. ఈ ఏడాది సైతం రూ.లక్ష వరకు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాడు. అయినా పత్తి కలుపు, మిర్చి తోట వేసిన కూలీలకు కూలి డబ్బులు ఇవ్వటానికి చేతిలో చిల్లి గవ్వ లేక పోవడం, గతంలో అప్పులు తెచ్చిన షేట్ల వద్ద మరో మారు అప్పు తెచ్చేందుకు ముఖం చెల్లకపోవడంతో గత నెల రోజులుగా ప్రసాద్‌ తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఇంట్లో నుంచి ప్రసాద్‌ చేనుకు వెళ్తుండగా భార్య కోటమ్మ పిలిచింది. ‘కూలోళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఇంటికొచ్చి పోతుండ్రు. ఇవ్వాళ అక్షయ (కూతురు) 4వ పుట్టిన రోజు.. ఇంట్లో చిల్లిగవ్వలేదు..’ అని చెప్పింది. చేనుకుపోయి కూలోళ్లకు డబ్బులిస్తాను. సాయంత్రం కూతురుకు కేక్‌ కొనుక్కొని వస్తాను అని ఇంటి నుంచి బయలుదేరిన ప్రసాద్‌ చెనుకు వెళ్లాడు. తీవ్ర మానసిక క్షోభతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కిందకు దించే లోగానే ప్రసాద్‌ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న తహశీల్దార్‌ ఎం. మంగీలాల్, ఎస్సై ఎం.రవికుమార్‌ మృతదేహాన్ని సందర్శించారు.
కూతురు పుట్టిన రోజు నాడే..
ప్రసాద్‌కు నాలుగేళ్ల కూతురు అక్షయ, మూడేళ్ల కుమారుడు యక్షంత్‌ ఉన్నారు. బుధవారం అక్షయ పుట్టిన రోజు.. కేక్‌ తెస్తానని ఇంటి నుంచి వెళ్లిన తండ్రి శవమై ఇంటికి రావడంతో కోయగుంపులో విషాదం నెలకొంది. డిగ్రీ వరకు చదువుకున్న ప్రసాద్‌ కబడ్డీలో ఉత్తమ క్రీడాకారుడు కూడా. జిల్లా, రాష్ట్రమీట్‌లో ఆడిన ఘనత ఆయనకుంది.

Advertisement
Advertisement