
దివ్య దర్శనం ఏదీ?
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను ఉచితంగా చూపిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన దివ్యదర్శన యాత్ర ఆర్భాటానికే పరిమితమైంది.
జనవరి 2న ప్రకటించిన ప్రభుత్వం
నిరుపేద హిందువులకు దక్కని ప్రముఖ ఆలయాల దర్శనం
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను ఉచితంగా చూపిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన దివ్యదర్శన యాత్ర ఆర్భాటానికే పరిమితమైంది. పథకం ప్రకటించిన తర్వాత ఆలయాల దర్శనంపై నిరుపేద హిందువుల్లో ఆశలు రేకెత్తాయి. నెలరోజులు గడుస్తున్నా.. నేటికీ యాత్ర గురించి ఊసే లేకపోవడంతో ఇది కూడా చంద్రబాబు గత హామీలు మాదిరిగానే ఉత్తుత్తిదేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గుత్తి రూరల్
రేషన్ కార్డు ఉంటే చాలు రవాణ, వసతి, భోజనాలు అన్నీ తామే భరించి దివ్యదర్శన యాత్రలో భాగంగా ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని నాలుగు పెద్ద దేవాలయాల్లో దైవదర్శనం చేయించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 2న యాత్ర ప్రారంభమతుందని దేవాదాయ శాఖ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు.
వారానికి 200 మంది
దివ్యదర్శనం యాత్రకు దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లాలోని 63 మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్సీఎస్టీలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, తమకు అందిన దరఖాస్తుల్లో లాటరీ ద్వారా మండలానికి 200 మంది చొప్పున ప్రతి వారం యాత్రకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మొదలు కాని యాత్ర
దివ్యదర్శనం యాత్రకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించి 45 రోజులు గడిచినా ఇంకా యాత్ర ప్రక్రియ మొదలు కాలేదు. ఈ విషయంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,800 దరఖాస్తులు అందాయి. అయితే యాత్రకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి ఇప్పటి వరకూ శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో మాత్రమే యాత్రలు జరిగాయి. ఆదేశాలు రాగానే భక్తులను యాత్రకు తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు.