
‘చావు’ తెలివితేటలు
బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ప్రతాలు సృష్టించి ఎల్‌ఐసీ అధికారులను పక్కదోవ పట్టించాలనుకున్న ఓ వ్యక్తి బండారం బయటపడింది.
- ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరణ
- విచారణలో వెలుగుచూసిన వైనం.. పరారిలో పాలసీదారుడు
- పోలీసుల అదుపులో ఏజెంట్
డబ్బుల కోసం ఓ పాలసీదారుడు అతి తెలివి ప్రదర్శించాడు. బతికి ఉండగానే నకిలీ ధ్రువీకరణ పత్రాలతో తాను చనిపోయినట్లు ఎల్‌ఐసీ అధికారులను మోసగించాడు. అయితే దీనిపై అధికారులు విచారణ చేపట్టడంతో పాలసీదారుడితో పాటు ఏజెంట్ అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఏజెంట్ పోలీసుల అదుపులో ఉండగా, పాలసీదారుడు పరారీలో ఉన్నాడు.
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్ : బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ప్రతాలు సృష్టించి ఎల్‌ఐసీ అధికారులను పక్కదోవ పట్టించాలనుకున్న ఓ వ్యక్తి బండారం బయటపడింది. ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో అధికారులు విచారణ చేపట్టడంతో అన్ని వ్యవహారాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండల పరిధిలోని సలివేందుల గ్రామానికి చెందిన సుబ్బరామిరెడ్డి అదే గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ శ్రీనివాసులరెడ్డి వద్ద రూ. మూడు లక్షల చొప్పున రెండు పాలసీలు కట్టారు. అయితే ఈ మధ్య సుబ్బరామిరెడ్డికి అప్పులు ఎక్కువకావడంతో వ్యాపారులంతా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో దిక్కుతోచని అతడు తాను మరణించినట్లు చెబితే పాలసీ డబ్బులు వస్తాయని, దాంతో అప్పులు చెల్లించుకోవచ్చని ఆలోచించాడు.
వేగంగా అడుగులు
వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సుబ్బరామిరెడ్డి ప్రయత్నించాడు. దీనికి ఏజెంట్ పూర్తి సహకారం అందించడంతో పని సులువుగా అయ్యింది. ఇందులో భాగంగా సలి వెందులలో కాపురం ఉంటున్న సుబ్బరామిరెడ్డి ప్రొద్దుటూరు మండలంలో నివాసం ఉంటున్నట్లు మండల పరిధిలోని గోపవరం పంచాయతీలో మరణించినట్లు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. ఈ తతంగం పూర్తి చేసుకుని ఏజెంట్ సహా యంతో తన వద్దనున్న బాండ్లను ఎల్‌ఐసీలో అందజేశారు.
బెడసి కొట్టిన వ్యవహారం
అయితే గత కొద్ది రోజుల కిందట ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు విచారణ చేపట్టారు. విచారణలో తమను పాలసీదారుడు, ఏజెంట్ బురిడీ కొట్టించారని తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డెవలప్‌మెంట్ అధికారిని తప్పించిన అధికారులు!
బీమా సంస్థను మోసం చేయటానికి ప్రయత్నించిన విస్తరణాధికారిని ఉన్నత స్థాయి అధికారులు తప్పించారు. ఈ వ్యవహారంలో ఆయనకు ప్రత్యక్షంగా ప్రమేయమున్నా కేవలం ఏజెంట్, పాలసీదారులపై కేసు నమోదు చేయించినట్లు సమాచారం.
అందరికీ వాటాలు..!
ప్రొద్దుటూరు ఎల్‌ఐసీ కార్యాలయంలో డెవలప్‌మెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌తో డెత్ సర్టిఫికెట్‌పై సంతకాలు చేయించారు. ఆ పత్రాలను ఉన్నతాధికారులకు సమర్పించారు. బీమా మొత్తం రూ. ఆరులక్షల్లో ఏజెంట్ శ్రీనివాసులరెడ్డికి పది శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ఇది పోను వచ్చే మొత్తంలో సగం తన కుటుంబానికి, మిగిలిన మొత్తం ఇందుకు సహకరించిన అధికారులకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
పోలీసుల అదుపులో ఏజెంట్
ఎల్‌ఐసీ నుంచి అక్రమంగా డబ్బులు తీసుకునేందుకు యత్నించిన ఏజెంట్ శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని కేవలం పదిశాతం కమీషన్ ఇస్తానంటే ఒప్పుకున్నట్లు ఆయన తెలిపినట్లు తెలుస్తోంది. సుబ్బరామిరెడ్డిని, ఇందుకు సహకరించిన అధికారిని ఒకేసారి విచారణ చేస్తే అసలు విషయం బయట పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.