
కోర్టుకు నయీం కుటుంబసభ్యులు
గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, బావమరిది, అత్తతో సహా 13మందిని గురువారం పోలీసులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు.
⇒ 13 మందిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
మిర్యాలగూడ: గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, బావమరిది, అత్తతో సహా 13మందిని గురువారం పోలీసులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెంలో ఉన్న నయీం అత్త, బావమరిది ఇళ్లలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు8వ తేదీన సోదాలు నిర్వహించారు. కాగా ఆసమయంలో పలు కీలక డాక్యుమెంట్లు, బంగారం, నగదు లభ్యమయ్యాయి. దాంతో పాటు ఓ బాలిక విక్రయం కేసులో నయీమ్ బంధువులు, ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
రిమాండ్ పొడిగింపు కోసం గురువారం మిర్యాలగూడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ, జిల్లా కోర్టు నుంచి వారిని ఇక్కడికి తీసుకువచ్చారు. రిమాండ్‌ను అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ నిందితులను ఆయా జైళ్లకు తరలించాలని మిర్యాలగూడ మెజిస్ట్రేట్ ఎ. రాధాకృష్ణమూర్తి ఆదేశించారు. పోలీసులు కోర్టుకు హాజరుపర్చిన వారిలో నయిమ్ భార్య హసీనాబేగం, అత్త సయ్యద్ సుల్తానా, బావమరిది సాదిఖ్‌తో పాటు బంధువులు, అనుచరులు పర్వీన్, షఫీ, పరమేశ్, ఎం. దత్తు, అబ్దుల్ మతీన్, కె.జంగయ్య, పులి నాగరాజు, బచ్చు నాగరాజు, మసూద్‌అలీ, సలీమాబేగం ఉన్నారు.