యాసిడ్‌ దాడిపై ముమ్మర దర్యాప్తు

డాక్టర్‌ బాలాజీ భూషణ్‌ పట్నాయక్‌ (ఫైల్‌ఫొటో) - Sakshi


ఆందోళనకరంగా బాధిత వైద్యుడి ఆరోగ్యం

సీసీ కెమెరాల ఫుటేజీలను

పరిశీలించిన పోలీసులు




అల్లిపురం(విశాఖ దక్షిణ) :

నగరంలో ఓ వైద్యుడిపై మంగళవారం రాత్రి జరిగిన యాసిడ్‌ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. యాసిడ్‌ దాడిలో గాయపడ్డ పిల్లల వైద్యుడు బాలాజీ భూషణ్‌ పట్నాయక్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఆయన ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిసింది. కుడి కన్ను కూడా పాక్షికంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి తరలించారు.



అక్కడ చికిత్స అనంతరం ఆయనను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరిగి సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. బాధితుడి నాలుక, వీపు భాగం యాసిడ్‌ దాడిలో దెబ్బతిన్నట్టు సమాచారం. అతని ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.



నిందితుల కోసం గాలింపు

యాసిడ్‌ దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగించుకుంటున్నారు. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారే వరకు సంఘటన స్థలానికి సమీపంలోని ఎంవీవీ రామ్‌ అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరా ఫుటేజీలు, సెవెన్‌ హిల్స్‌ హాస్పటల్‌లో బాధితుడిని ఎవరెవరు కలిశారు, తదితర విషయాలను పరిశీలించారు. బుధవారం ఉదయం నుంచి హాస్పటల్‌ వద్ద దర్యాప్తు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసినట్టు మహారాణిపేట సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఫిర్యాదులో బాధితుడు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని సీఐ పేర్కొన్నారు.



గుర్తు తెలియని వ్యక్తులు తన కారు ఆపారని, కారు గ్లాసు కిందకి దించి ఏం కావాలని అడిగేలోపే తనపై యాసిడ్‌తో దాడి చేశారని బాధిత వైద్యుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామన్నారు. బాలాజీ భూషన్‌ది ఒడిషా రాష్ట్రం బరంపురం జిల్లా. ఈయనకు భార్య, పాపతో పాటు తల్లి, తమ్ముడు, చెల్లి ఉన్నారు. భార్య, పాపతో కలసి పందిమెట్టలోని జీజీఆర్‌ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. వ్యక్తిగతంగా చాలా మంచివాడని, అతనిపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని అతని సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలో ఓ వైద్యుడిపై యాసిడ్‌ దాడి జరగడంపై పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే వృత్తిని సక్రమంగా నిర్వహించలేమని ఆవేదన చెందుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top