రోగాల కాలం | Sakshi
Sakshi News home page

రోగాల కాలం

Published Tue, Aug 29 2017 10:49 PM

రోగాల కాలం

– చిన్న పిల్లలతో కిక్కిరిస్తున్న ఆస్పత్రులు
– జిల్లాలో పెరుగుతోన్న నిమోనియా కేసులు
– వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు
– జిల్లా వ్యాప్తంగా 537 కేసులు గుర్తింపు


ధర్మవరం అర్బన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వర్షాలు కురియాల్సిన సమయంలో భానుడి ప్రతాపం చూపటం, ఇదే సమయంలో పగటి పూట ఉక్కపోత, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటం రోగాలకు కారణమవుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు విషజ్వరాలతోపాటు నిమోనియా, ఆస్తమా వంటి వ్యాధులకు గురవుతున్నారు. దీంతో గత పదిరోజుల నుంచి జిల్లాలో చిన్నపిల్లల ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.

జలుబుతో మొదలై...
తొలుత జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతోంది. నిమోనియా తీవ్రత పెరగడంతో పలువురు పిల్లలు ఆస్తమా, ఫిట్స్‌కు గురవుతున్నారు. పగలు వేడిగా ఉండటం, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటంతో పిల్లల శరీరం ఇందుకు తట్టుకోవడం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తేమ శాతం తగ్గటం, పెరగడం వల్ల గొంతు ఇన్ఫెక‌్షన్లు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆహార నియమావళిని పాటించకపోవడం వల్ల చిన్నపిల్లలు నిమోనియా బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

537 కేసులు గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారికంగా 537 నిమోనియా కేసులు నమోదయ్యాయి. ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో నిమోనియా కేసులు నమోదవుతున్నాయి. కొంత మంది వైద్యులు కేవలం దగ్గు, జలుబుగానే వైద్యం చేస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు
– వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నందున సాధ్యమైనంత వరకు పిల్లలను బయట తిప్పకూడదు.
– చల్లటి పదార్థాలు, చల్లని నీరు తాగించకూడదు. సాధ్యమైనంత వరకు గోరువెచ్చటి నీటిని మాత్రమే తాగించాలి.
– చల్లటి గాలి తగలకుండా దలసరి దుస్తులు వేయాలి.
– ఒక రోజులో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి.

ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు
- డాక్టర్‌ యుగంధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ధర్మవరం
చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రికి చాలా నిమోనియా, ఆస్తమా కేసులు వస్తున్నాయి. ఇందులో చాలా కేసులు క్లిష్టమైనవిగా ఉంటున్నాయి. కొద్దిపాటి జలుబు, దగ్గు మొదలుకాగానే జాగ్రత్త పడటం మంచిది. జిల్లా వ్యాప్తంగా 537 కేసులను వైద్యులు గుర్తించారు.  ప్రైవేటు ఆస్పత్రుల్లో వీటి సంఖ్య వందలకు దాటింది.

కేసులు పెరుగుతున్నాయి
- డాక్టర్‌ బి.వి.సుబ్బారావు, చిన్నపిల్లల వైద్యుడు, ధర్మవరం
నిమోనియా, ఆస్తమాతో బాధపడుతున్న పిల్లల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చలికాలంలో రావాల్సిన కేసులు ఈ సీజన్‌లో వస్తున్నాయి. 2010, 2014లో ఇదే తరహా కేసులు వచ్చాయి. తిరిగి ఈ ఏడాది కేసులు గణనీయంగా నమోదయ్యాయి. గడిచిన 10 రోజుల్లో నిమోనియా, ఆస్తమా కేసులు ఎక్కువగా వచ్చాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా నిమోనియా సోకుతోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement