పాడిరైతు అభ్యున్నతికి పాటుపడుతూ..


  •  పశుపోషణలో అత్యుత్తమ సేవలు

  •  అందిస్తున్న ప్రసన్నకుమార్‌ 

  • మామునూరు : హన్మకొండ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రేపల్లె ప్రసన్నకుమార్‌ పాడిరైతుల నేస్తంగా రూపుదిద్దుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా ఇటీవల ‘రైతు నేస్తం’ అవార్డు వరించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌కు చెందిన ప్రసన్నకుమార్‌ ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ప్రధానంగా దోహదపడింది ఆయన కుటుంబ నేపథ్యమేనని చెప్పొచ్చు. ప్రసన్నకుమార్‌ సోదరుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌(తెలంగాణ గురుకుల విద్యాలయాలు, సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శి). సోదరి ఆర్‌.సబిత గైనకాలజిస్ట్‌గా వికారాబాద్‌లో సేవలు అందిస్తున్నారు. ఇళ్లు విద్యాలయంగా నిల్చి ప్రసన్నకుమార్‌కు జీవితంలో ఉన్నతస్థానాలకు ఎలా ఎదగాలనే పాఠాలు నేర్పింది. అంకితభావంతో విధులు ఎలా నిర్వర్తించాలనే అంశాన్ని తన సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకొని నేర్చుకున్నారు ప్రసన్నకుమార్‌. నైతిక విలువలు, ఆదర్శాలనే ఆలంబనగా చేసుకొని రేపల్లె ప్రసన్నకుమార్‌ ముందుకుసాగుతున్నారు. 

     

    దేశ, విదేశాల్లో అధ్యయనం చేస్తూ..

    1997 నుంచి 2000 సంవత్సరం వరకు పశువైద్యంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించారు. అదే ఏడాది ఓ సంస్థలో పశుపోషణ, ఫీడ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అవకాశం లభించింది. దీంతో అక్కడ విధులు నిర్వర్తించారు.  2001 సంవత్సరంలో పశుపోషణ విభాగం( గేదెల పరిశోధనా స్థానం) పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలో శాస్త్రవేత్తగా చేరారు. 2005లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనాత్మక ప్రాజెక్టులను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులను అందుకున్నారు. వ్యవసాయ పరి«శోధనలపై మరింత అధ్యయనం చేసేందుకు ఆరు దేశాల్లో పర్యటించారు. ఈక్రమంలో సౌదీ అరేబియా దేశంలో రెండేళ్లు పనిచేశారు.  రైతుల దినచర్యపై టెక్నికల్‌ బుల్లెటిన్స్‌ రాసి, ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. 2007లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి వచ్చింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆలంపూర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా, 600 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం ఎదురైంది. అనంతరం మళ్లీ తనకు ఎంతో ఇష్టమైన పశువైద్య విభాగం దృష్టిసారించారు. టెక్నికల్‌ ఇండియా జెన్కో బయోటెక్‌ ప్రైవేట్‌  కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 మార్చిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగావకాశం కల్పించింది. 2014 నుంచి 2016 వరకు పశుపోషణ, యాజమాన్య విభాగానికి అధిపతిగా కోరుట్ల పశువైద్య కళాశాల కరీంనగర్‌లో విధులు నిర్వహించారు. 2016 ఏప్రిల్‌ 12న వరంగల్‌ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో రైతులకు ఆనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినందుకుగానూ ఆయనకు ఇటీవల రైతు నేస్తం అవార్డు దక్కింది. 

     

    పొందిన అవార్డులు..

     2015లో న్యూఢిల్లీలోని ఇన్విటేషనల్‌ ఫ్రెండ్‌షిప్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అవార్డు.

     2016లో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పశుపోషణపై అత్యుత్తమ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీంతో డాక్టర్‌ మహేశ్వర్‌ మిశ్రా అవార్డు లభించింది. 

     2016లోనే పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు మెమోరియల్‌ అవార్డు, రైతునేస్తం పురస్కారం లభించాయి. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top