
రాజమహేంద్రవరంలో ఘటన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం మత్తులో ఒక రౌడీషీటర్, మరో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రాజమహేంద్రవరంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళి ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా కోటిపల్లి బస్టాండ్ వద్దకు వెళ్లారు.
అక్కడ ఓ జ్యూస్ షాప్ వద్ద రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కర్రి దుర్గా సూర్యప్రసన్నకుమార్, రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, ధవళేశ్వరానికి చెందిన వినోద్‌కుమార్ మద్యం మత్తులో వేరే వ్యక్తులతో గొడవపడుతున్నారు. వారిని నాగబాబు, కాళి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో రెచ్చిపోయిన సూర్యప్రసన్నకుమార్, హరీష్, వినోద్‌కుమార్ కలిసి కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళిపై దాడి చేశారు. దుర్భాషలాడుతూ అర్ధగంటకు పైగా కదలనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం కానిస్టేబుల్, హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.