విహారయాత్రలో విషాదం

సతీష్‌ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

లక్కవరం (చింతూరు) : పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు చేపట్టిన విహారయాత్ర చివరికి విషాదయాత్రగా దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చింతూరు సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..


 


లక్కవరానికి చెందిన సర్పక సతీష్‌, నవీన్, చింతూరుకు చెందిన రవి, కార్తీక్, రమేష్‌లు స్నేహితులు. వీరిలో రవి మినహా మిగతా నలుగురూ ఆటోడ్రైవర్లు. ఆదివారం నవీన్‌ పుట్టిన రోజు కావడంతో స్నేహితులంతా తులసిపాక సమీపంలోని ఘాట్‌రోడ్‌లోని వాగు వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో స్నానానికి దిగిన సతీష్‌(30) కొద్దిసేపటికి కనబడలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు వాగులోకి దిగి వెతకగా సతీష్‌ మృతదేహం లభ్యమైంది.  దీంతో వారంతా భయపడి మోతుగూడెం పోలీస్‌స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. 


 


చింతూరు సీఐ దుర్గాప్రసాద్, మోతుగూడెం ఎస్సై కిషోర్‌లు వాగు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అప్పటికే చీకటి పడటంతో  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సోమవారం  చింతూరు ఆసుపత్రికి తరలించారు. సతీష్‌ మృతిపై అతడి స్నేహితులు అందించిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆటోతో పాటు కిరాణాషాపు నడుపుకుంటున్న మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


 


పోస్ట్‌మార్టం ఆలస్యంపై రాస్తారోకో


సతీష్‌ మృతదేహాన్ని సోమవారం ఉదయం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా సాయంత్రం వరకూ పోస్ట్‌మార్టం నిర్వహిం^è లేదు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, ఆటోడ్రైవర్లు, దళిలసంఘాల ఆధ్వర్యంలో చింతూరు ప్రధాన రహదారిపై మృతదేహంతో కలిసి రాస్తారోకో చేశారు. సకాలంలో పోస్ట్‌మార్టం చేయని  డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని, మృతుడి భార్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో విషయం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసాద్‌ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. పోస్ట్‌మార్టం చేసేందుకు వైద్య నిపుణుడు లేనందునే ఆలస్యమైందని, వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  సీపీఎం సభ్యుడైన సతీష్‌ మృతదేహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి నివాళులర్పించారు. 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top