రాళ్లెత్తే కూలీలకు రక్షణ కరువు

రాళ్లెత్తే కూలీలకు రక్షణ కరువు


* నీరు లేదు.. భోజనం చేయనీయరు.. మండే ఎండల్లోనూ శ్రమదోపిడీ

* చాలీచాలనీ జీతాలకు ప్రాణాలను పణంగా పెడుతున్న పొరుగు రాష్ట్రాల కార్మికులు

* అమలు కాని కార్మిక చట్టాలు.. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

* సర్కారు వారి ఇలాకాలోనే వెట్టిచాకిరీ

* తాత్కాలిక సచివాలయ నిర్మాణ కూలీల బతుకులు దుర్భరం


సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో రాళ్లెత్తుతున్న కూలీలకు రక్షణ కరువైంది. అద్భుత ప్రజా రాజధాని అంటూ చంకలు గుద్దుకుంటున్న సర్కారు వారి ఇలాకాలో అత్యంత ఘోరమైన వెట్టిచాకిరీ అమలవుతోంది.రాజధాని కోసం భూములను త్యాగం చేసిన స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపకుండా ప్రభుత్వం దగాచేసింది. పొరుగు రాష్ట్రాల కార్మికుల శ్రమదోపిడీకి అవకాశం కల్పించింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువ కార్మికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తోటి కార్మికుల్లో, వారి కుటుంబాల్లో భయందోళనలను సృష్టించింది. ఇక్కడ తాము అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను ‘సాక్షి’ ప్రతినిధి వద్ద కార్మికులు ఏకరువు పెట్టారు. తమ పేర్లు, ఫొటోలు పేపర్లో వేస్తే ఉన్న ఉపాధి పోయి రోడ్డున పడతామంటూ వారు వేడుకున్న తీరు చూస్తే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అవగతమవుతోంది.

 

ఒక్కో గదిలో 30 మంది మగ్గాల్సిందే

గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు చేపట్టిన ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీలు పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చాయి. బీహార్, చత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ పనులు చేయిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1,800 మందికిపైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి రోజువారీ వేతనంగా రూ.185 నుంచి రూ.250 ఇచ్చి శ్రమదోపిడీ చేస్తున్నారు. కొందరికి నెలవారీగా రూ.8 వేల నుంచి 15 వేలు ఇస్తున్నారు.దాదాపు రెండు నెలలుగా కార్మికులకు జీతాలు అందలేదు. ఇంతేకాదు ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. తాగేందుకు మంచినీరు లేదు. దాహమైతే దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. సమయానికి భోజనం చేయడానికి వీలుండదు. పని పూర్తి చేసి వెళ్లు అని నిర్మాణ సంస్థల ప్రతినిధులు హూంకరిస్తుంటారు. తలదాచుకునేందుకు పక్కా నివాసాలు లేవు. మండే ఎండల్లోనూ రేకుల షెడ్లలో ఉక్కబోతతో మాడిపోవాల్సిందే. షెడ్లలోని ఒక్కో గదిలో 20 నుంచి 30 మంది బతకాల్సిందే. కొన్ని షెడ్లలో కనీసం బాత్‌రూమ్, లెట్రిన్ సౌకర్యం కూడా లేదు. ఇంత జరుగుతున్నా మంత్రులు, అధికారులు అటువైపు దృష్టి సారించి కార్మికుల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు.  

 

అమలు కాని కార్మిక చట్టాలు..

సర్కారు వారి ఇలాకాలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఏ కార్మికుడైనా ఎనిమిది గంటలు పని చేయాలన్న కార్మిక చట్టం ఇక్కడ అమలు కాకపోవడంతో ఏకంగా 12 నుంచి 14 గంటలకుపైగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్ట్‌లు అమలు చేయాల్సిన నిర్మాణ కంపెనీలు రెండు షిప్ట్‌లతో శ్రమదోపిడీ చేస్తున్నాయి. పని వేళలు పాటించకపోవడంతో రాత్రి, పగలు తమకు అప్పగించిన పనులు పూర్తి చేసేందుకు కార్మికులు శ్రమిస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.నిర్మాణ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగితే వెంటనే వైద్య సదుపాయం అందించే అవకాశం లేదు. వేసవి తీవ్రత కారణంగా ఇటీవల కార్మికులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనికి విరామం ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సచివాలయ నిర్మాణంలో పనిచేసే కార్మికులకు వర్తింపచేయకపోవడం చూస్తే చట్టం అమలులో పాలకుల చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top