తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు టీడీపీ వ్యతిరేకం కాదని ఆపార్టీ తెలంగాణా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.
ఏపీతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్: టీడీపీ నేతలు
తిరుపతి తుడా: తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు టీడీపీ వ్యతిరేకం కాదని ఆపార్టీ తెలంగాణా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తిరుపతి మహానాడులో మూడవ రోజు ఆదివారం మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా మహానాడులో టీడీపీ తీర్మానం చేసిందని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. నదులపై కర్ణాటక, మహారాష్ట్రలో అక్రమంగా 400 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారన్నారు. ఆ రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లే కేసీఆర్ నోరుమెదపడంలేదన్నారు.
ప్రాజెక్ట్‌ల పేరుతో ధనదోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులం కలసి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఓ పక్క చెబుతూనే మరోపక్క ఏపీతో కేసీఆర్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ టీడీపీని ఇబ్బంది పెట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ బోర్డు మెంబర్ నిజామాబాద్ టీడీపీ అధ్యక్షుడు అరికెల నరసారెడ్డి మాట్లాడుతూ గోదావరి కృష్ణాజలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని మహానాడులో తీర్మానం చేశామన్నారు. ఆంధ్రాలో తెలంగాణలో టీడీపీ నేతలు ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కట్టే ప్రాజెక్టులు సక్రమంగా ఉంటే తామే టీడీపీ అధినేతతో మాట్లాడి అడ్డుతగలకుండా చూస్తామని చెప్పారు.