– రబీ సీజన్‌లో వంగ సాగుపై నిపుణుల సలహాలు
- కాయ తొలుచు పురుగు నివారణతో అధిక దిగుబడులు
కర్నూలు అగ్రికల్చర్ : వంగను అన్ని కాలాల్లో సాగు చేసేందుకు అవకాశం ఉన్నా రబీ సీజన్ అనుకూలంగా ఉంటుంది. యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. దీనికితోడు రబీ సీజన్‌లో కూరగాయల కొరత ఉంటుంది. చీడపీడీల సమస్య అంతగా ఉండదు. నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో వంగ సాగుకు రబీ సీజన్ అనుకూలంగా ఉంటుంది. బోర్లు, బావులు, ఇతర సాగు నీటి పారుదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే రైతులు వంగ సాగుకు సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రబీ వంగ సాగులో యాజమాన్య పద్ధతులపై కర్నూలు ఏరువాక కేంద్రం(డాట్ సెంటరు) శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ సుజాతమ్మ వివరించారు.
అదను, అనువైన రకాలు..
వంగ సాగుకు ఈ నెల 1వ తేది నుంచి నవంబర్ చివరి వరకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే నారు పోసుకుని ఉంటే ఇప్పుడు నాట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నారు పోసుకుంటే నారు పోసిన 25 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 260 గ్రాములు, సంకరజాతి రకాలైతే 160 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. దేశివాలీ పచ్చరకాలు లేదా దేశివాలి చారల రకాలు అనుకూలం. మహికో హైబ్రిడ్ -9, మహికో - 56, గ్రీన్‌లాంగ్, గ్రీన్‌బంచ్ రకాలు జిల్లాకు అనుకూలంగా ఉంటాయి.
నాటుకునే విధానం..
వంగను 60 60 సెంటీ మీటర్లు లేదా 75“50 సెంటీ మీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. ఎకరాకు 200 కిలోల వేప పిండిని చివరి దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేప పిండికి అదనంగా ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడరు వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల కార్బో ప్యూరాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి. ఎకరాకు 6 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
రసాయన ఎరువులు...
వంగసాగులో పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులు కూడా అవసరం. 40 కిలోల నత్రజనితోపాటు 24 కిలోల ప్రకారం భాస్వరం, పొటాష్ వేసుకోవాలి. నత్రజనిని మూడు విడతలుగా 30వ రోజు, 60వ రోజు, 75వ రోజు పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలైతే 50 శాతం అధికంగా వేసుకోవాల్సి ఉంటుంది.
డ్రిప్ పద్ధతి అనుకూలం..
వంగ పంట సాగులో డ్రిప్ పద్ధతి పాటించడం ఉత్తమం. రబీలో నీటి కొరత ఉంటున్నందునా డ్రిప్ వినియోగించుకుంటే నీటి ఆదాతో పాటు ఎరువులు కూడా సద్వినియోగమవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై ఏపీఎంఐపీ అధికారులు డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. వివరాలకు కలెక్టరేట్‌లోని ఏపీఎంఐపీ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఇటీవల పెద్ద రైతులకు సైతం సబ్సిడీపై డ్రిప్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మొవ్వ, కాయతొలుచు పురుగు....
వంగలో ప్రధానంగా మొవ్వ, కాయ తొలుచు పురుగు సమస్య ప్రధానంగా ఉంటుంది. 30–40 రోజుల దశలో ఇది వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది. మొవ్వ, కాయ తొలుచు పురుగులు పంటకు తీవ్ర నష్టం కల్గిస్తాయి. దీనివల్ల కాయలు, కొమ్మలు, వంకర్లు పోతాయి. కొమ్మల చివరి భాగాన పెరుగుదల ఆగిపోతుంది. ఈ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి నివారించుకుంటే దిగుబడి అధికంగా పొందే అవకాశం ఉంది. పురుగు ఆశించిన కొమ్మలను తెంచి నాశనం చేయాలి. నివారణకు 2మి.లీ. ప్రొఫినోపాస్/ మి.లీ. సైపర్ మెత్రిన్‌ను లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
ఎర్రనల్లి...
బెట్ట వాతావరణ పరిస్థితుల్లో వంగకు ఎర్రనల్లి వ్యాపించే అవకాశం ఉంది. ఇది ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఎర్రటి మచ్చలు వస్తాయి. ఇందువల్ల చెట్టు ఎదగదు. గిడసబారిపోతుంది. కాయలు రావు. వచ్చినా నాణ్యత ఉండదు. నివారణకు 3 మి.లీ. డైకోపాల్/ 10 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటిలో కలిపి ఎకరాలకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయాలి.
పచ్చదోమ, తెల్లదోమ...
వంగలో పచ్చదోమ, తెల్లదోమ కూడా ప్రబలే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. క్లోరో ఫైరిపాస్/ మోనోకోటోపాస్‌తోపాటు 5మి.లీ. వేపనూనెను లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలి.
పిండినల్లి...
వంగకు నష్టం కలిగించే వాటిలో పిండినల్లి కూడా ఒకటి. ఈ రకం పురుగులు లేత గులాబి రంగులో ఉండి వాటిపై తెల్లటి పిండి మాదిరిగా ఉంటుంది. పిల్ల పురుగులు కాండం మొదలు దగ్గర ఉండి మొక్కలు మొత్తానికి పాకి నష్టం కలిగిస్తాయి. వీటి ప్రభావంతో చెట్లు ఎండిపోయే పరిస్తితి వస్తుంది. నివారణకు మి.లీ. డైక్లోరోఫాస్/2మి.లీ. పాస్పోమిథాన్/ 2మి.లీ. ప్రొఫినోపాస్‌ను లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. ఇతర వివరాలకు ఫోన్(99896 23810)లో సంప్రదించవచ్చు.