మేమే గెలుస్తాం... కాదు ఈ ఎన్నికే చెల్లదు!

మేమే గెలుస్తాం... కాదు ఈ ఎన్నికే చెల్లదు! - Sakshi


హెచ్‌సీఏలో ఇరు వర్గాల వాదనలు

సజావుగా ముగిసిన ఎన్నికలు

త్వరలో ఫలితాలు
ఉప్పల్‌: ఎప్పుడో పదవీకాలం ముగిసినా ఇంకా కుర్చీలు వదలని కార్యవర్గం... ఎన్నికలు నిర్వహించాలంటూ మళ్లీ మళ్లీ కోరిన ప్రత్యర్థి వర్గం... మధ్యలో లోధా కమిటీ సిఫారసులు, ఆపై కోర్టులో పిటిషన్లు... జిల్లా కోర్టు ఉత్తర్వులు, ఫలితాలు నిలిపేయమని హైకోర్టు ఆదేశం... వీటికి తోడు మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ నామినేషన్‌ తిరస్కరణ... కొద్ది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కు సంబంధించి సాగిన పరిణామాలు, మలుపులు, వివాదాలు ఇవి. ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణతో మంగళవారం వీటికి కాస్త విరామం లభించింది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ రెడ్డి పర్యవేక్షణలో 207 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 216 మంది ఓటర్లుగా నమోదు కాగా, ద్వంద్వ ఓటు, ప్రాక్సీ ఓట్లకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి విచక్షణ మేరకు కొన్ని ఓట్లను తొలగించారు. అయితే కథ ఇంకా ముగిసిపోలేదు. వీటి ఫలితాలు వెంటనే ప్రకటించే అవకాశం లేదు. ఈ ఎన్నికల చెల్లుబాటు అంశం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉండటమే దీనికి కారణం. లోధా కమిటీ సిఫారసులపై సుప్రీం కోర్టు ఆదేశాలనే ఉల్లంఘిస్తూ ఈ ఎన్నికలు సాగాయంటూ కోర్టులో పలు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం దీనిపై వాదనలు జరగనున్నాయి. రిటర్నింగ్‌ అధికారి కూడా నియమ నిబంధనలకు సంబంధించి కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అజహర్‌ నామినేషన్‌ తిరస్కరణపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఇరు వర్గాల ప్రతినిధులు, ఓటర్లు మీడియాతో మాట్లాడారు. వివేకానంద్‌ గ్రూప్‌ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేయగా, అయూబ్‌ గ్రూప్‌ మాత్రం ఈ ఎన్నికే చెల్లదంటూ రాబోయే కోర్టు తీర్పుపై ఆశాభావం వ్యక్తం చేశారు.‘స్వయంగా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయూబ్‌కు నన్ను విమర్శించే హక్కు లేదు. ఆరు నెలలకు పైగా ఎన్నికలు నిర్వహించకుండా ఆయన అక్రమంగా పదవిలో కొనసాగారు. ఇప్పుడు దానికి ముగింపు లభిస్తోంది. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే మాకు ఉన్న సానుకూలతను చూపిస్తోంది. ఇంత మంది ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషకరం. అజహర్‌ విషయంలో ఆర్‌ఓ నిబంధనల ప్రకారమే వ్యవహరించారు. నేను కేబినెట్‌ హోదాలో ఎలాంటి జీతమూ తీసుకోవడం లేదు కాబట్టి పోటీకి అర్హత ఉంది.’

– జి. వివేకానంద్,అధ్యక్ష పదవి అభ్యర్థి

‘ఎన్నికల ప్రక్రియ మొత్తం చట్టవిరుద్ధంగా సాగింది. తాము మాత్రమే పదవుల్లోకి వచ్చేందుకు కొంతమంది పూర్తిగా అక్రమ రీతిలో ఎన్నికలు నిర్వహించారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఈ ఎన్నికలు మొత్తం చెల్లవంటూ కోర్టు తీర్పు వస్తుందనే నమ్మకం మాకుంది’.    – అర్షద్‌ అయూబ్,మాజీ అధ్యక్షుడు

‘గత కొన్నేళ్లుగా ప్రతిభ గల తెలంగాణ క్రికెటర్లకు హెచ్‌సీఏ తీవ్ర అన్యాయం చేసింది. శివలాల్‌ యాదవ్‌ మొదలు పలువురు పెద్దలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఆటను భ్రష్టు పట్టించారు. కొత్తగా వచ్చే కార్యవర్గమైనా ఆటను అభివృద్ధి చేస్తుందని విశ్వసిస్తున్నా’.

– అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి,‘శాట్స్‌’ చైర్మన్‌

‘ఇది హెచ్‌సీఏకు పండుగ దినం. మేమంతా విజయం సాధించడం ఖాయమైపోయింది. అవినీతిని పారదోలి హైదరాబాద్‌ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తాం. ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ ఆటను ప్రోత్సహించి తగు సౌకర్యాలు కల్పిస్తాం. గల్లీ స్థాయినుంచి అంతర్జాతీయ స్థాయికి క్రికెటర్లను తీర్చి దిద్దుతాం. నాకు పోటీ లేకపోవడమే నాపై ఉన్న నమ్మకానికి ఉదాహరణ’.             – టి. శేష్‌నారాయణ్,

కార్యదర్శి పదవి అభ్యర్థి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top