శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు నైతిక విలువలు పాటించాల్సిందేనని, ప్రతి సభ్యుడు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని వివిధ వర్గాల మేధావులు అభిప్రాయపడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు నైతిక విలువలు పాటించాల్సిందేనని, ప్రతి సభ్యుడు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని వివిధ వర్గాల మేధావులు అభిప్రాయపడ్డారు. అలా పాటించని వారిని చట్టరిత్యా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలోని రుషికొండ టూరిజం అతిథి గృహంలో శాసనసభ నైతిక విలువల కమిటీ చైర్మన్, డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన మేధావుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ భగవత్‌కుమార్ మాట్లాడుతూ శాసనసభలో పాటించాల్సిన నియమావళిని నిర్దిష్టంగా ఆచరించడం లేదన్నారు. పౌరుడికన్నా ప్రజాప్రతినిధి మరింత క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ సభ్యులు హుందాతనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రచయిత రామతీర్థ మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, రచయిత్రి జగద్ధాత్రి, న్యాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ సత్యనారాయణతదితరులు మాట్లాడారు.
అలా అయితే రాజకీయ
ఇబ్బందులు.. స్పీకర్ కోడెల
నైతిక విలువలు పాటించని, ఆస్తుల విలువలు ప్రకటించని ఎమ్మెల్యేలపై చర్యలు, శిక్ష విధింపుల వల్ల రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. తదుపరి సమావేశాలు తిరుపతి, విజయవాడలో జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో వచ్చిన సభ్యుల సూచనలు, సలహాల ను క్రోడీకరించి ఆచరణసాధ్యమైనవి పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అసెం బ్లీలో చర్చలు సజావుగా సాగడం లేదని డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సభ సక్రమంగా జరగకపోవడం వల్ల రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతోందన్నారు.