ముఖం చాటేసిన మంత్రివర్యులు | Ministers emphasize the face | Sakshi
Sakshi News home page

ముఖం చాటేసిన మంత్రివర్యులు

Feb 8 2016 12:45 AM | Updated on Aug 29 2018 7:45 PM

మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామంలోనే సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు.

సమస్యలతో సహవాసం చేస్తున్న మంత్రిగారి దత్తత గ్రామస్తులు
ప్రమాదాలకు నిలయంగా మారిన లో లెవెల్ చప్టా
రాళ్ళు లేచి అధ్వానంగా ఉన్న ప్రధాన, అంతర్గత రహదారులు
ఇదీ వెంగళాయపాలెం గ్రామం దుస్థితి

 
గుంటూరు రూరల్ : మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామంలోనే సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. స్వయాన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు దత్తత తీసుకున్న వెంగళాయపాలెం గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. మంత్రివర్యులు దత్తత తీసుకుంటే తమ బతుకులు మారుతాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురవుతోంది.
 
నానా అవస్థలు
గ్రామంలో అంతర్గత రహదారులతోపాటు ప్రధాన రోడ్డు సైతం అధ్వానంగా ఉంది. ఈ రహదారులపై ప్రయాణించాలంటే జనం నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారిలో ఉన్న లో లెవెల్ చప్టా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. చప్టా మధ్య భారీ సైజు రంధ్రం పడింది. ద్విచక్ర వాహనం పట్టేంత రంధ్రం పడటంతో వాహన చోదకులు ఎప్పుడు ఏం ప్రమాదం వాటిల్లుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాణం మరీ ఇబ్బందికరంగా మారింది. మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ చప్టా ప్రస్తుతం వాహనాల రాకపోకలను అనువుగా లేదు.
 
ఛిద్రమైన ప్రధాన రహదారి..
ప్రధాన రహదారి పూర్తిగా రాళ్ళులేచి ఛిద్రంగా మారింది. భారీ వాహనాలు వెళ్ళేటపుడు రాళ్ళు ఎగిరి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ప్రజలు భయాందోలనలు చెందుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామంలో మురుగు కాల్వల వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా తయారైంది. దోమలు వ్యాపించి విషజ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రివర్యులు తమ గ్రామం వైపు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement