'కిషన్రెడ్డికి పలుకుబడి ఉంటే..' | Sakshi
Sakshi News home page

'కిషన్రెడ్డికి పలుకుబడి ఉంటే..'

Published Fri, Oct 9 2015 4:29 PM

'కిషన్రెడ్డికి పలుకుబడి ఉంటే..' - Sakshi

మెదక్: ప్రతిపక్ష నేతలు రైతు బంధువులు కాదు.. రాబందులు అని, రైతు ఆత్మహత్యలపై బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. శుక్రవారం మెదక్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీజేపీ టార్గెట్ గా అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

బీజేఎల్పీ ఉపనాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పలుకుబడి ఉంటే.. కేంద్ర నుంచి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకురావాలని కేటీఆర్ అన్నారు. బిహార్ కు ప్రకటించినట్లే తెలంగాణకు కూడా ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని, నరేంద్ర మోదీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రధాన మంత్రా? అని ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఈ విధంధమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.8 వేల కోట్లు ఇప్పించాలని కిషన్ రెడ్డని ఉద్దేశించి కడియం వ్యాఖ్యానించగా.. 'మమ్మల్ని అడిగి మ్యానిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని చేర్చారా? మాకు చేతగాదని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబితే తప్పకుండా నిధులు ఇప్పిస్తాం' అని కిషన్ రెడ్డి పేర్కొనడం విదితమే.

Advertisement
Advertisement