మిర్యాలగూడలో మందకృష్ణ అరెస్టు | manda krishna arrested in nalgonda district | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో మందకృష్ణ అరెస్టు

Mar 10 2016 4:07 AM | Updated on Oct 8 2018 3:00 PM

మిర్యాలగూడలో మందకృష్ణ అరెస్టు - Sakshi

మిర్యాలగూడలో మందకృష్ణ అరెస్టు

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఏపీ పోలీసులు బుధవారం తెలంగాణలో నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు.

నాటకీయ ఫక్కీలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
నారావారిపల్లె నుంచి యాత్ర నేపథ్యంలో ముందు జాగ్రత్త

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ దాచేపల్లి: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఏపీ పోలీసులు బుధవారం తెలంగాణలో నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు. ఎస్సీల వర్గీకరణ కోసం సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె నుంచి గురువారం రథయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో న ల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్నెస్పీ అతిథిగృహంలో ఉన్న మందకృష్ణను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ్నుంచి గురజాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కృష్ణమాదిగను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 మాట్లాడదాం రమ్మని...
కృష్ణమాదిగను అరెస్టు చేసేందుకు గానూ నలుగురు ఏపీ పోలీసులు ఓ సుమోలో మిర్యాలగూడలోని ఎన్నెస్పీ అతిథిగృహానికి వచ్చారు. నలుగురిలో యూనిఫాంలో ఉన్న ఒక్కరే లోపలికి వెళ్లి మీతో మాట్లాడాలని చెప్పి మందకృష్ణను గెస్ట్‌హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే మరో ముగ్గురు పోలీసులు వచ్చి మందకృష్ణను సుమో ఎక్కించారు. ఇది గ్రహించిన కార్యకర్తలు గెస్ట్‌హౌస్ గేటు మూసేందుకు ప్రయత్నించారు. కానీ, యూనిఫామ్‌లో ఉన్న పోలీసు అధికారి వెంటనే గేటు తీయడం, సుమో వెళ్లిపోవడం క్షణాల్లో జరిగాయి. అసలు ఎవరు తీసుకెళ్లారో అర్థం కాకపోవడంతో ఆందోళన కు గురయ్యామని, భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లిన తర్వాత సరైన సమాచారం అందిందని మందకృష్ణ అనుచరుడు సౌలు ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్‌దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... మిర్యాలగూడ పోలీసులకు సమాచారమిచ్చిన తర్వాతే కృష్ణమాదిగను ఏపీ పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. కాగా, అంతకుముందు కృష్ణమాదిగ ఆచూకీ కోసం నడికుడి రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లను ఆపి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. 

 జ్వరం, విరేచ నాలతో బాధపడుతున్న మందకృష్ణ
ఇలాఉండగా కృష్ణమాదిగ జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం కోదాడలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి నుంచి సాయంత్రం నేరుగా మిర్యాలగూడకు వచ్చారు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని.. విశ్రాంతి తీసుకునేందుకు ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ స్థానిక ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే సినీ ఫక్కీలో వచ్చిన పోలీసులు కృష్ణమాదిగను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement