ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణమిత్రులు. కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. కష్టనష్టాలలో ఒకరికొకరు అండగా ఉన్నారు.
నర్మెట్ట (వరంగల్) : ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణమిత్రులు. కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. కష్టనష్టాలలో ఒకరికొకరు అండగా ఉన్నారు. చివరికి చావులో కూడా ఒకరికి తోడుగా మరొకరూ వెళ్లిపోయారు. ప్రాణమిత్రుడి మరణవార్త విని.. మరో మిత్రుడి గుండె ఆగి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్మెట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నర్మెట్టకు చెందిన గడ్డం నర్సయ్య(50) మేస్త్రీ పనిచేసేవాడు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఇంటి వద్ద మృతి చెందాడు. ఈ విషయాన్ని నర్సయ్య మిత్రుడు గాదర ఏసోబు(52)కు అతడి భార్య పద్మ చెప్పింది. దీంతో నర్సయ్యా అంటూ అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.