ముప్పుతిప్పలు | lot of problems | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పలు

Nov 26 2016 10:54 PM | Updated on Sep 4 2017 9:12 PM

ముప్పుతిప్పలు

ముప్పుతిప్పలు

బ్యాంకులకు సెలవులు.. ఏటీఎంలలో నగదు నిల్‌.. జిల్లా ప్రజలకు నగదు కష్టాలు రెట్టింపయ్యాయి.

వరుస సెలవులతో పెరిగిన నగదు కష్టాలు
– నిన్న, నేడు బ్యాంకులకు సెలవు
– 28న భారత్‌ బంద్‌తో బ్యాంకులు మూత పడే అవకాశం 
– ఏటీఎంలలో నగదు నిల్‌
– అల్లాడుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): బ్యాంకులకు సెలవులు.. ఏటీఎంలలో నగదు నిల్‌.. జిల్లా ప్రజలకు నగదు కష్టాలు రెట్టింపయ్యాయి. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, రాజకీయ పార్టీల నేతలకు పెద్దనోట్ల రద్దు ప్రభావం కనిపించడం లేదు. వారి వ్యవహారాలు యథావిధిగా సాగుతున్నాయి. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగో వారం అయినందున శనివారం బ్యాంకులకు సెలవు వచ్చింది. ఆదివారం సెలవు కారణంగా బ్యాంకులు తెరుచుకోవు. సోమవారం భారత్‌ బంద్‌ కారణంగా బ్యాంకులు పనిచేయడం అనుమానమే. వెరసి బ్యాంకులకు వరుస సెలవుల వల్ల నగదు కష్టాలు మరింత పెరగనున్నాయి. వారంలో కేవలం రూ.24వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో బ్యాంకులు రెగ్యులర్‌గా పనిచేస్తేనే నగదు కొరత తీరని పరిస్థితి. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును విత్‌డ్రా చేసుకోవడంలో కేంద్రం ఆంక్షలు విధించడంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా వీటికి 445 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఖాతాదారులు వారంలో తీసుకునే మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడానికి ప్రయత్నిస్తే డబ్బులు లేవు, కేవలం రూ.4వేలు మాత్రమే రాసుకోండి అంటూ సూచిస్తున్నారు. కరెన్సీ చస్ట్‌ ఉన్న ఎస్‌బీఐలోనే నగదు కొరత తీవ్రంగా ఉంది. పప్పులు పెట్టి పోరు మాన్పించినట్లుగా బ్యాంకర్లు ఖాతాదారులకు రూ.2వేలు, రూ.3వేలు ఇచ్చి పంపుతున్నారు. ఎస్‌బీఐలోనే అనేక బ్రాంచ్‌ల్లో విత్‌డ్రా నిలిచిపోయింది. ఏపీజీబీ, సిండికేట్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. జిల్లా సహకార కేంద్రబ్యాంకు పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
 
ఏటీఎంలలో నగదు నిల్‌
జిల్లాలో 400 పైగా ఏటీఎంలు ఉన్నా.. ఉపయోగం లేకుండా పోయింది. బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలపై ఒత్తిడి పెరిగింది. అక్కడక్కడ కొన్ని ఏటీఎంలలో లక్ష, 2 లక్షల నగదు పెడుతున్నారు. ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. 90శాతం ఏటీఎంలు మూత పడగా.. మిగిలిన వాటిల్లో పెట్టిన డబ్బుల కోసం క్యూ కడుతున్నారు.  వివిధ బ్యాంకులు ఏటీఎంల దగ్గర నో క్యాష్‌ అంటూ బోర్డులు పెట్టడం గమానార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement