జంగారెడ్డిగూడెంలో లాకప్‌ డెత్‌! | LOCKUP DEATH IN JANGAREDDYGUDEM! | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెంలో లాకప్‌ డెత్‌!

May 17 2017 12:49 AM | Updated on Aug 21 2018 9:20 PM

జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఓ హోటల్‌ కార్మికుడు లాకప్‌ డెత్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు పోలీస్‌ అధికారులు ప్రయత్నాలు...

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఓ హోటల్‌ కార్మికుడు లాకప్‌ డెత్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు పోలీస్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో వివిధ హోటళ్లలో ఒడిశాకు చెందిన బురిడి లక్ష్మణ్‌ (33) అనే వ్యక్తి వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అతడు జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వలస వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత శుక్రవారం మఫ్టీలో ఉన్న పోలీసులు లక్ష్మణ్‌ వద్దకు వెళ్లి.. అతనిపై కేసు ఉందని, విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని అడిగారు. అందుకు అతడు నిరాకరించడంతో ఆగ్రహించిన పోలీసులు మరికొందరు సిబ్బందిని తీసుకెళ్లి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వారికి లక్ష్మణ్‌ సహకరించకపోవడంతో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్టు సమాచారం. ఒక పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిపై ప్రతాపం చూపడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగారుపడిన పోలీసులు లక్ష్మణ్‌ భార్య, మరికొందరిని పిలిచి అతడి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్టు సమాచారం. వెంటనే వారు స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్యం చేసి.. పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఏలూరుకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లగా అక్కడ మృతి చెందినట్టు నిర్థారించారని సమాచారం. అయితే, లక్ష్మణ్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే మరణించాడనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. లక్ష్మణ్‌ మృతదేహాన్ని అదే రోజున అంబులెన్స్‌లో ఒడిశాలోని అతడి స్వస్థలానికి పోలీసులే తరలించినట్టు చెబుతున్నారు. తన భర్తను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని లక్ష్మణ్‌ భార్య రత్నం చెబుతోంది. కాగా, ఘటన నేపథ్యంలో అక్కడి ఎస్సై సెలవుపై వెళ్లినట్టు తెలిసింది.
లాకప్‌ డెత్‌ కాదు : డీఎస్పీ
పోలీసులు కొట్టడం వల్ల లక్ష్మణ్‌ చనిపోలేదని, అది లాకప్‌ డెత్‌ కాదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు పేర్కొన్నారు. లక్ష్మణ్‌ మద్యం సేవించి టైలరింగ్‌ షాప్‌పై దాడి చేశాడని వచ్చిన ఫిర్యాదు మేరకు అతణ్ణి స్టేషన్‌కు పిలిచి విచారించి పంపించివేశామన్నారు. పోలీసులు కొట్టడం వల్ల అతడు చనిపోయాడని బంధువులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. అతడు క్రానిక్‌  ఫ్రాంకియాసిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు జంగారెడ్డిగూడెంలో వైద్యం చేసిన డాక్టర్‌ చెప్పారన్నారు. దీంతో తానే ఏలూరులో ఆశ్రం ఆసుపత్రికి ఫోన్‌చేసి చెప్పి చికిత్స నిమిత్తం అతణ్ణి పంపించానని తెలిపారు. ఈ వ్యాధి ఎప్పుడు సీరియస్‌ అవుతుందో చెప్పలేమని, ఆ రోజు లక్ష్మణ్‌ 40కి పైగా వాంతులు చేసుకున్నట్టు వైద్యులు చెబుతున్నారని డీఎస్పీ వివరించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement