పేకాట క్లబ్‌తో జీవితాలు నాశనం | Sakshi
Sakshi News home page

పేకాట క్లబ్‌తో జీవితాలు నాశనం

Published Tue, Aug 23 2016 5:18 PM

పేకాట క్లబ్‌తో జీవితాలు నాశనం

ఎమ్మెల్యే పీఆర్కే
 
మాచర్ల టౌన్‌: పల్నాడు ప్రాంతంలో పేదల జీవితాలతో ఆటలాడుతున్న పేకాట క్లబ్‌ మూసివేత కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమానికి సమాయత్తం అవుతోంది. ఉద్యమానికి మహిళలు మద్దతు పలుకుతున్నారు. క్లబ్‌ మూసివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. దాచేపల్లిలో పేకాట క్లబ్‌ జోరుగా సాగుతోందని, ప్రజల జీవితాలను నాశనం చేసే పేకాటకు అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో అర్ధం కావడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.
 
అసలే కరువు... 
వర్షాభావంతో పల్నాడు ప్రాంతంలో కరువు దాపురించింది. ఈ తరుణంలో నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌ ప్రజల పాలిట శాపంగా మారింది. పేకాటలో సర్వం కోల్పోయిన వారు వీధుల పాలవుతున్నారు. కరువు కారణంగా కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో కొందరు వ్యసనపరులు ఆస్తులను అమ్మి ఉన్నది కాస్తా పేకాటలో పెడుతుండడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో కలవరం నెలకొంది.  
 
రోజూ బంకినీయే రూ.20 లక్షలు..
మాచర్ల, గురజాల నుంచే కాకుండా జిల్లా, పొరుగు రాష్ట్రాల నుంచి పేకాటరాయుళ్లు జూదమాడేందుకు క్లబ్‌కు వస్తున్నారు. జూదంపై నిర్వాహకులకు రోజూ రూ.20 లక్షలు బంకిని వస్తుందంటే పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.  అధికార పార్టీ నేతలు తమ ప్రయోజనాల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని పేకాట బాధితుల కుటుంబీకులు మండిపడుతున్నారు. క్రికెట్‌ బెట్టింగ్, పేకాట, మూడు ముక్కలాట వంటి జూదాలు ఎక్కడ జరిగినా సత్వరమే స్పందిÆ చే పోలీసులు దాచేపల్లి క్లబ్‌ గురించి ఎందుకు పట్టించుకోరో అన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. పేకాటక్లబ్, అక్రమ మైనింగ్‌లపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. క్లబ్‌ ప్రారంభించిన కొత్తలో అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే  పోలీసులు వెంటనే మూసివేశారన్నారు. తర్వాత అధికార పార్టీ నేతల వత్తిళ్లకు తలొగ్గి మళ్లీ క్లబ్‌ను తెరిపించారన్నారు. ఈ క్లబ్‌ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్‌ నడిపే నేతలకు ఎవరూ అడ్డు చెప్పకపోవడంతో క్యాబరే డాన్సులు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసే క్లబ్‌ను మూసివేయించి కుటుంబాలు చితికిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్లబ్‌ను మూయించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబాల శాపనార్ధాలు, ఉసురుతో  తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మహిళలతో ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement