‘కొత్త ఫైల్’ రెడీ! | kotha gudem district works raising speed new file is ready | Sakshi
Sakshi News home page

‘కొత్త ఫైల్’ రెడీ!

Jun 29 2016 8:09 AM | Updated on Oct 3 2018 7:08 PM

‘కొత్త ఫైల్’ రెడీ! - Sakshi

‘కొత్త ఫైల్’ రెడీ!

కొత్తగూడెం జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

దుమ్ము దులిపి..  స్కాన్ చేసి..
జేసీ పర్యవేక్షణలో రెవెన్యూ ఫైలింగ్ పనులు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాలో పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైళ్ల స్కానింగ్ పనులకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జేసీ దివ్య పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది సోమవారం నుంచి పాత ఫైళ్లన్నింటినీ మండలాలు, గ్రామాలవారీగా నంబర్లను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతోపాటు ఒక్కొక్కటిగా స్కానింగ్ చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడితే ఫైళ్లన్నీ భద్రంగా పెట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించడంతో  జిల్లా రెవెన్యూ సిబ్బంది ఆ దిశగా పాత ఫైళ్లను దుమ్ముదులిపి క్రమసంఖ్యలో స్కాన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

దశాబ్దాల క్రితం ఫైళ్లు కూడా ఉండటంతో అవన్నీ శిథిలావస్థకు చేరి.. చిరిగిపోయి ఉన్నాయి. జేసీ సూచనల మేరకు వీటిని రికార్డు గది నుంచి తీసి.. మండలం పేరు, గ్రామం, ఫైల్ సంఖ్యను ముందుగా కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని స్కాన్ చేసి మండలాలవారీగా కోడ్ నమోదు చేసి.. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ఎప్పటికైనా సమాచారం భద్రంగా ఉంటుందని జేసీ సూచించడంతో ఉద్యోగులు ఆ పనిలో మునిగిపోయారు.

 20 మండలాల సమాచారం
కొత్తగూడెం జిల్లాలోకి వస్తాయని భావిస్తున్న 20 మండలాల సమాచారాన్ని స్కానింగ్ చేసే పనిలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. గ్రామాల సరిహద్దులు, నక్షాలు, చెరువు శిఖం, ప్రభుత్వ భూములు, పహాణీలు తదితర వివరాలతో కూడిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాకు కొత్త అధికారులు వస్తారనే ఆలోచనతో వారికి గ్రామాలు, మండలాలకు సంబంధించిన వివరాలు సులువుగా దొరకాలనే ఉద్దేశంతో ఈ ఫైళ్లను రెడీ చేస్తున్నారు. మండలాలకు సంబంధించిన వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయడంతోపాటు ఫైళ్లను స్కాన్ చేసే పని అయిన తర్వాత ఖమ్మం జిల్లాలోకి వచ్చే మండలాల ఫైళ్లను కూడా ఇలాగే చేయనున్నారు. ఫైళ్లన్నీ మాన్యువల్‌గా అందుబాటులో ఉండటంతోపాటు మండలం కోడ్‌తో కంప్యూటర్‌లో కూడా వివరాలను తెలుసుకునేలా చూస్తున్నారు. కొత్త జిల్లాలో ఫలానా గ్రామంలోని సర్వే నంబర్ చూడాలంటే వెంటనే కంప్యూటర్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement