పవన్ కల్యాణ్ కోసం ఎదురు చూశాం | Kapu agitation supporter kills self over quota | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ కోసం ఎదురు చూశాం

Feb 2 2016 8:54 AM | Updated on Aug 29 2018 8:38 PM

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కాపులను ఉద్ధరిస్తాడనుకున్నామని... తమది ప్రశ్నించే పార్టీ అని స్థాపించి, ప్రశ్నలు లేని పార్టీగా మిగిల్చారని లేఖలో రాయడం చర్చనీయాంశమైంది.

కాపులను బీసీల్లో చేర్చాలంటూ బలిదానం
కాకినాడ కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య
కాపు విద్యార్థులకు భవిష్యత్తు ఉండడం లేదని ఆవేదన
పవన్ పార్టీ ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిందని ఆగ్రహం
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని లేఖలో డిమాండ్

 
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్ల ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. నిన్న తునిలో జరిగిన విధ్వంసకాండ మంటలు చల్లారకముందే ఓ కాపు సామాజిక వర్గీయుడు బలిదానం చేశాడు. న్యాయం కావాలి.. న్యాయం జరగాలి.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి... అంటూ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కాకినాడ డెయిరీ ఫారం సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి (53) సినిమారోడ్డులోని డీజిల్ హౌస్‌లో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి, కుమారుడు రాజేష్ ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కావడం తో ఆమె వేరుగా ఉంటోంది. వెంకటరమణమూర్తి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని బెన్నెట్ క్లబ్ మేడపైకి ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన టీవీ డిష్‌కు నైలాన్ తాడు కట్టుకుని కిందికి దూకడంతో మెడకు తాడు బిగిసి అక్కడికక్కడే మృతి చెందారు.

పవన్‌ది ప్రశ్నలు లేని పార్టీ..
సామాజిక, ఆర్థిక రంగాల్లో కాపులు ఎంతో వెనుకబడి ఉన్నారని, 90 శాతం మార్కులు సంపాదించినా కాపు విద్యార్థులకు భవిష్యత్తు ఉండడం లేదని వెంకటరమణమూర్తి తన ఆత్మహత్య లేఖలో రాశారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కాపులను ఉద్ధరిస్తాడనుకున్నామని... తమది ప్రశ్నించే పార్టీ అని స్థాపించి, ప్రశ్నలు లేని పార్టీగా మిగిల్చారని లేఖలో రాయడం చర్చనీయాంశమైంది.

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్యే లు జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాం బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, కాకినాడ ఆర్డీఓ బీఆర్ అంబేడ్కర్ తదితరులు మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీఎస్పీలు సూర్యదేవర వెంకటేశ్వరరావు, పిట్టా సోమశేఖర్‌ల నేతృత్వంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
 
సూసైడ్ నోట్‌లో వెంకటరమణ ప్రస్తావించిన అంశాలు..

  • మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కాపులకి మిగిలిన కులాలతో సమానంగా హక్కులు కల్పించాలి.
  • సమాజంలో ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు కులంపై ఆధారపడి ఉండవని ప్రభుత్వం ఇకనైనా తెలుసుకోవాలి.
  • కాపులు ఐదేళ్ల కోసారి ఓట్లు వేయడానికి తప్ప ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం పొందడానికి అర్హులు కారా!
  • కాపు విద్యార్థి 90 శాతం మార్కులు సాధించినా సీట్లు సంపాదించడానికి పాట్లు పడుతున్నారు. 90 శాతం మార్కులు వచ్చిన అధిక ఫీజులు చెల్లించాలని వారి ఆశయాలను చంపుకుని తమ చదువును సగంలోనే నిలిపి వేస్తున్నారు.
  • కాపు కులస్తులు 90 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. ఆర్థికంగా మిగిలిన కులస్తులుతో పోల్చినా కాపులు ప్రతీ రంగంలోను వెనుకబడి ఉన్నారు.
  • పవన్ కళ్యాణ్ కాపులకు ఏదో ఒక న్యాయం చేస్తారని ఎదురుచూశాం. చివరికి మాకు ఎదురు చూపు మాత్రమే మిగిలింది. మాది ప్రశ్నించే పార్టీ అని విన్నవించుకున్నారు. కాని చివరకు ప్రశ్నలు లేని పార్టీగా మిగిలిపోయింది.
  • ఈ కాపు సింహ గర్జన ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement