మట్కాపై ఉక్కుపాదం
మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశించారు.
- విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం
- సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గోపీనాథ్ జట్టి
కర్నూలు: మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జిల్లాలోని అన్ని స్టేషన్ల పోలీసు అధికారులు, సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్లతో ఎస్పీ..సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్కాతో పాటు పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్‌పై క్షేత్రస్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. విధి నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సమస్యాత్మక వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. ఫ్యాక‌్షన్ నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధినిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.
నగర సీఐలతో డీఎస్పీ సమీక్ష...
సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని డీఎస్పీ రమణమూర్తి నగర సీఐలకు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు నగర పరిధిలోని సీఐలతో నేరాలపై సమీక్షించారు. సీఐలు కృష్ణయ్య, డేగల ప్రభాకర్, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజు యాదవ్, నాగరాజురావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా నగర పరిధిలోని పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.