ఐదో తరగతి ప్రవేశాలకు ముగిసిన కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

ఐదో తరగతి ప్రవేశాలకు ముగిసిన కౌన్సెలింగ్

Published Fri, Jul 1 2016 2:11 AM

Government social welfare Girls Gurukul School  Fifth Class entrances in Counseling

మడికొండ : జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాలకు మడికొండలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. జిల్లాలో నూతనంగా మంజూరైన ధర్మసాగర్, హసన్‌పర్తి, దుగ్గొండి, నర్సింహులపేట, ఆత్మకూర్, నర్మెట, భూపాలపల్లి, ములుగు, వరంగల్ వెస్ట్ (హన్మకొండ) 9 పాఠశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. గురువారం వర్షం పడుతున్నా విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కౌన్సెలింగ్‌కు ముందు డీసీఓ ఎస్.రూపాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కడ చేరుతారో ముందుగానే నిర్ణయించుకోవాలన్నారు.

నూతన పాఠశాలలకు సొంత భవనాలు లేనందున రెండు, మూడు నెలల వరకు తాత్కాలింకంగా అందుబాటులో ఉన్న పాఠశాలల్లో తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ధర్మసాగర్ పాఠశాలకు సంబంధించిన తరగతులు మడికొండలో, హసన్‌పర్తి పాఠశాల తరగతులు రాయపర్తిలో, దుగ్గొండి పాఠశాల తరగతులు ఇనుగుర్తి, నర్సింహులపేట పాఠశాల తరగతులు తొర్రూర్‌లో, ఆత్మకూర్ పాఠశాల తరగతులు పరకాలలో, నర్మెట  పాఠశాల తరగతులు జఫర్‌గఢ్‌లో, భూపాలపల్లి పాఠశాల తరగతులు చిట్యాల, ములుగు పాఠశాల తరగతులు మహబూబాబాద్, వరంగల్ వెస్ట్ పాఠశాల తరగతులు పర్వతగిరిలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 80 మంది చొప్పున 9 పాఠశాలల్లో 720 సీట్లు భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌లో స్థానిక పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ విద్యారాణి, రాధిక, ఇతర పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement