పేదలకు హామీగా ఉంటా.. రుణాలివ్వండి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో పేదలకు హామీ నేనే ఇస్తా.. రుణాలిచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్‌లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్‌ల రుణాల జారీ తీరుపై ఆయన సమీక్షించారు.
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో పేదలకు హామీ నేనే ఇస్తా.. రుణాలిచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్‌లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్‌ల రుణాల జారీ తీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ చింతలపూడి చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు, జంగారెడ్డిగూడెం సహకార కేంద్ర బ్యాంకు అధికారులు హామీ ఇస్తేనే గాని ఎస్సీలకు రుణాలు ఇవ్వలేమని చెబుతున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పేదలకు రుణాలందించడంలో ఏ బ్యాంకు అయినా హామీ కావాలంటే వారందరికీ నేనే హామీ ఇస్తా.. జిల్లాలో ఏ ఒక్క పేద కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా రుణాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఏ బ్యాంకుకు హామీ కావాలన్నా వారంతా హామీ పత్రం తీసుకువస్తే క్షణాల్లో సంతకం చేస్తానని చెప్పారు.
ఎన్నడూ లేనివిధంగా బ్యాంకర్లు వ్యవహరిస్తున్నారని వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ చేసినప్పటికీ రుణాలివ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రుణాలు పొందిన వారిలో 93 శాతం ప్రజలు నిజాయితీగా తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకర్లకు జమ చేశారని, కేవలం 7 శాతం మంది మాత్రమే తీసుకున్న రుణాన్ని చెల్లించలేదన్నారు. హామీ కావాలని కోరిన చింతలపూడి చైతన్య గ్రామీణ బ్యాంకు, జంగారెడ్డిగూడెం సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచి మేనేజర్లను సాయంత్రం 5 గంటల్లోగా హామీ పత్రాలు తీసుకుని తనను కలవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.
వారానికి ఐదు
పాఠశాలలు తనిఖీ చేస్తా
ఏలూరు సిటీ : జిల్లాలో అమలు చేస్తోన్న అన్ని విద్యాభివృద్ధి కార్యక్రమాలు యథాతథంగా అమలు చేయాలి. ప్రభుత్వ బడుల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఈవో డి.మధుసూదనరావును ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ–1, 2 గ్రేడుల్లో కేవలం 6.7 శాతం మందే ఉన్నారని, కనీసం పుస్తకం తీసి చదవలేని విద్యార్థులు 37 శాతం మంది ఉన్నారన్నారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎంతో మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు. తాను వారానికి ఐదు పాఠశాలలు తనిఖీలు చేస్తానని, 5వ తరగతి పిల్లలను 4వ తరగతికి సంబంధించిన పాఠాల్లోని అంశాలను అడుగుతానని, విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.