గౌరీపుత్రుని ఉత్సవం..గంగకు కారాదు ఉపద్రవం..
గణనాథుని వ్రతం సందర్భంగా రకరకాల ఫలాలు, పత్రి వాడడంలో ప్రకృతికీ, మనిషికీ ఉన్న అవినాభావ అనుబంధపు మర్మం దాగి ఉందంటారు. అయితే..అదే వినాయకచవితి సందర్భంగా ఏటా వేలాది సంఖ్యలో రసాయనాలతో కూడిన ఆ గౌరీపుత్రుని ప్రతిమలను గంగలో నిమజ్జనం చేస్తూ ప్రకృతికి నష్టం చేస్తున్నారని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు.
-
పీఓపీ విగ్రహాలతో జలవనరులు కలుషితం
-
మట్టి ప్రతిమలే మేలంటున్న పర్యావరణవేత్తలు
రావులపాలెం :
గణనాథుని వ్రతం సందర్భంగా రకరకాల ఫలాలు, పత్రి వాడడంలో ప్రకృతికీ, మనిషికీ ఉన్న అవినాభావ అనుబంధపు మర్మం దాగి ఉందంటారు. అయితే..అదే వినాయకచవితి సందర్భంగా ఏటా వేలాది సంఖ్యలో రసాయనాలతో కూడిన ఆ గౌరీపుత్రుని ప్రతిమలను గంగలో నిమజ్జనం చేస్తూ ప్రకృతికి నష్టం చేస్తున్నారని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసే గణేశ ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. మట్టి విగ్రహాలను వాడండని మెుత్తుకుంటున్నారు. అయినా ఆట్టే ప్రయోజనం ఉండడం లేదు. అప్పటికే భక్తులు, ఉత్సవ కమిటీల ఆర్డర్లపై వేలాది పీఓపీ విగ్రహాలు తయారై మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. అందుకే మట్టి విగ్రహాలపై ప్రచారం ముందస్తుగానే చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. విగ్రహాల తయారీదారులను చైతన్యపర్చడంతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.. ఈ ఏడాది సెప్టెంబర్ 5న వినాయక చవితి కాగా ఇప్పటికే రావులపాలెం కేంద్రంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. రావులపాలెం, కొత్తపేట సెంటర్లలో రాజస్థాన్‌కు చెందిన కొందరు రోడ్డు పక్కన తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకుని జిప్సం వినాయక విగ్రహాల తయారీ మొదలు పెట్టారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోని ఈ పీఓపీ గణనాథుల విగ్రహాలను చూసిన ప్రజలు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ స్థాయిలో మట్టి విగ్రహాలు తయారు చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి విగ్రహాలే శ్రేష్టం
మట్టితో తయారుచేసి విగ్రహాలు చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో నిమజ్జనం చేసినా ఎటువంటి హానీ ఉండదు. జిప్సంతో చేసిన విగ్రహాలు నీటిలో కరిగితే అనేక అనర్థాలు వస్తాయి. కాల్షియం, సల్ఫేట్ లాంటి అనేక రసాయనాలను వేడి చేసి తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీటిలో కరగక పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. పీఓపీ విగ్రహాలతో నీరు కలుషితమై జలచరాలపై ప్రభావం పడుతుంది. పీఓపీ విగ్రహాల వల్ల హానికర జిప్సం, మెగ్నీషియం, కాల్షియం, లెడ్, ఆర్గానిక్, ఇనుము లాంటి వాటితో పాటు రంగులు, రసాయనాలు నీటిలోకి చేరతాయి. ఈ నీరు తాగినా, నీటిలోని జలచరాలను తిన్నా అల్సర్, క్యాన్సర్, కామెర్లు, మెదడు, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చవితి సందర్భంగా వాడవాడలా భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు పోటీ పడటం కూడా ఒక రకంగా జిప్సం విగ్రహాలను తయారీని ప్రోత్సహిస్తోంది. నిజానికి పాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే మట్టి విగ్రహాలకు ఖర్చు తక్కువ అవుతుంది. మట్టి విగ్రహాలను నీటిలో కరిగిపోయే పసుపు, కుంకుమ, వాటర్ పెయింట్స్ రంగులతో ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. పీఓపీ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను గురించి వినాయక చవితి రోజు సమీపించాక హడావిడి చేయడం కాకుండా ఇప్పుడే ప్రజల్లో చైతన్యం కలిగించాల్సి అవసరం ఎంతైనా ఉంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
పర్యావరణాన్ని అన్ని విధాలా పరిరక్షించాలి. మొక్కలు నాటడంతో ఆక్సిజన్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేసే ఏసీలు, ఫ్రిజ్‌ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించాలి. నీరు కాలుష్యం కాకుండా ఉండాలంటే ప్రధానంగా జిప్సం విగ్రహాలను తయారీని తగ్గించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి.
– కోట సోమేశ్వరరావు, రావులపాలెం
పోటీ కాదు..భక్తి ప్రధానం
ఎంత భారీ విగ్రహం పెట్టామన్న పోటీ తత్వాన్ని వీడి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలి. భక్తి ప్రధానమన్న అంశాన్ని గుర్తించాలి. పర్యావరణానికి ముప్పు కలిగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉత్సవ మండపాల్లో ఏర్పాటు చేయడానికి ఉత్సవ కమిటీలు చొరవ చూపాలి.
– ఎస్‌వీఆర్ కృష్ణారెడ్డి, ఊబలంక