
పోలీస్ టార్చర్!
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. మూడుముళ్లతో ఒక్కటవుదామనుకున్నారు.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు! వారెక్కడున్నారో తెలియదు కానీ అబ్బాయికి సహకరించారంటూ అతడి ఐదుగురు స్నేహితులపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
► నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నం
► కరీంనగర్ జిల్లాలో ఘటన
► ప్రేమజంటకు సహకరించారని ఖాకీల ప్రతాపం
► పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే దారిలోనే విషం తాగిన వైనం
► ఇద్దరి పరిస్థితి విషమం
► పోలీసులు హింసించారంటున్న బాధిత కుటుంబీకులు
హుస్నాబాద్: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. మూడుముళ్లతో ఒక్కటవుదామనుకున్నారు.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు! వారెక్కడున్నారో తెలియదు కానీ అబ్బాయికి సహకరించారంటూ అతడి ఐదుగురు స్నేహితులపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే ఖాకీలు తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు స్టేషన్‌కు పిలవడం.. రాత్రి 12 గంటల దాకా చిత్రహింసలకు గురిచేయడం! ఒకటి రెండు కాదు.. పది రోజులుగా ఇదే ‘విచారణ’! ఈ హింస తట్టుకోలేక పోలీసుస్టేషన్‌కు వెళ్లే దారిలోనే ఆ ఐదుగురు యువకుల్లో నలుగురు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఆటో నుంచి దిగి.. విషం తాగి..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన లొట్టగట్టు రజని, బోయిని శంకర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రజని(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, శంకర్(23) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం రజని తన అమ్మమ్మ గ్రామమైన మెదక్ జిల్లా నంగునూరు మండలం అక్కన్నపెళ్లికి వెళ్లింది. వివాహం చేసుకునేందుకు అక్కడ్నుంచే ప్రియుడు శంకర్‌తో వెళ్లిపోయింది. ఈ విషయం రజని తల్లిదండ్రులకు తెలియడంతో వారి ఆచూకీ కోసం తిరిగారు. తమ కూతురు శంకర్‌తో వెళ్లిపోవడానికి అతడి స్నేహితులే కారణమంటూ నంగునూరు మండలం రాజ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురు యువకులపై ఫిర్యాదు చేశారు.
దీంతో నవాబుపేటకు చెందిన బోయిని సురేశ్, గడిపె సాగర్, బోయిని రఘు, బోయిని సదయ్యతో పాటు బొమ్మనపల్లికి చెందిన కొంకట సృజన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమజంట ఆచూకీ చెప్పాలంటూ ఈ యువకులను గతనెల 26 నుంచి ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు రప్పించుకొని చిత్రహింసలకు గురిచేశారు. ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటల తర్వాత విడిచిపెడుతూ రోజూ చితకబాదారు. గురువారం కూడా రాజ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు నవాబుపేట నుంచి ఈ ఐదుగురు ఆటోలో బయల్దేరారు. మార్గం మధ్యలో కోహెడ సమీపంలో మూత్ర విసర్జన కోసమంటూ సురేష్, సాగర్, రఘు, సృజన్ ఆటో దిగి వెళ్లిపోయూరు. వారితో వచ్చిన సదయ్య ఆటోలోనే ఉండిపోయాడు. ఇంతలో చెంచల్‌చెర్వుపల్లె రహదారి సమీపంలో నలుగురు యువకులు విషం తాగి రోడ్డుపై పడిపోయారని స్థానికులు చెప్పడంతో సదయ్య అక్కడికి వెళ్లాడు. 108కు ఫోన్ చేసి హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.
అయితే యువకుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబీకులు ఇద్దరిని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి, మరో ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి ఆవరణ వద్ద బాధితుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించినా.. ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు.
చిత్రహింసలు పెట్టారు: సదయ్య
ప్రేమజంట విషయంలో మాకెలాంటి సంబంధం లేదు. కావాలనే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుండ్లు. పది రోజుల నుంచి పోలీసులు ప్రతిరోజు స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెట్టారు.
మావోళ్లకు ఏమైనా అరుతే ఊరుకోం: బాధిత కుటుంబ సభ్యులు
వాళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకునేందుకు ఎళ్లి పోయిండ్లు. ఎటు పోరుండ్రో మా పోరగాళ్లకు ఏం తెలుసు? పోలీసోళ్లు రోజు స్టేషన్‌కు పిలిపించి కొడుతుండ్రు. మేమేం తప్పు చేసినమో నిరుపించాలే. మావోళ్లకు ఏమైనా అయితే ఊరుకోం. వాళ్లిచ్చే పైసలకు ఆశపడే పోలీసులు మావాళ్లను కొట్టిండ్రు.