 
															‘పూల’ సందడి
													 
										
					
					
					
																							
											
						 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ..రంగురంగుల పూలతో చూడముచ్చటగొలిపేది బతుకమ్మ..
						 
										
					
					
																
	- 
		మార్కెట్ రంగులమయం
- 
		కుప్పలుగా బతుకమ్మపూలు
- 
		తంగెడు, గునక పూలకు డిమాండ్
	కరీంనగర్ బిజినెస్ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ..రంగురంగుల పూలతో చూడముచ్చటగొలిపేది బతుకమ్మ..బంగారు బతుకును ఇవ్వాలని కోరుతూ చేసేది బతుకమ్మ.. బతుకమ్మ ఆరంభంతో మార్కెట్ అంతా రంగులమయమైంది. పూలవ్యాపారులతో సందడిగా మారింది. గ్రామాల్లో రంగురంగుల పూలు సేకరించి నగరంలోని మార్కెట్‌లో చాలా మంది విక్రయిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు మార్కెట్ పూలతో సందడిగా మారనుంది.  
	 
	మార్కెట్ రంగులమయం 
	బతుకమ్మ పండుగ మెుదలుకావడంతో మార్కెట్ మొత్తం రంగు రంగుల పూలతో నిండుగా కనిపిస్తుంది. తంగెడు, గునుకపూలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామర, పట్టుకుచ్చుల పూలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. బతుకమ్మ పేర్చేందకు కావాల్సిన గుమ్మడి ఆకులు, గౌరమ్మను చే సేందకు గుమ్మడి పూలు అందుబాటులో ఉన్నాయి. 
	పల్లెల నుంచి.. 
	జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు నగరానికి వచ్చి మార్కెట్లో పూలు విక్రయిస్తున్నారు. అల్గునూర్, శ్రీరాములపల్లి, సైదాపూర్, చల్లూరు, కోహెడ, మానకొండూర్, కేశవపట్నం, తిమ్మాపూర్, బెజ్జంకి, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామడుగు, గంగాధర మండలాల్లోని పలు గ్రామాలు, శనిగరం, కొత్తపల్లి నుంచి సైతం వ్యాపారులు వస్తున్నారు. గుట్టలు, చెలక ప్రాంతాల్లో సేకరించిన పూలను నగరానికి తరలించి అమ్ముకుంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు.  
	మొదటి, చివరి రోజు గిరాకీ
	బతుకమ్మ ప్రారంభం నుంచి తొలి రోజు, చివరి రోజు చాలా గిరాకీ ఉంటుందని వ్యాపారులు తెలిపారు. మధ్యరోజుల్లో కొంచెం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. 
	 
	గిరాకీ ఉంటది
	బతుకమ్మ పండుగంటే అందరికి సంబుర మే. పొద్దుగాలనే పూలు కొసుకొని అమ్ముకుందామని ఇక్కడికి వచ్చినా. గిరాకీ బాగానే ఉంటది. తంగెడుపూలు, గునుక పూలు ఎక్కువగా అమ్ముడుపోతయి. మా ఊరు నుంచి బాగానే మంది వచ్చిండ్రు. యాడాదికోసారచ్చే పండుగ కాబట్టి  పొద్దగాలటి నుంచి∙అందరు వచ్చి పూలు కొనుక్కపోతుండ్రు. మేం కూడా ఏటా వచ్చి పూలమ్ముకుంటాం.
	– రాజవ్వ, అల్గునూర్ 
	 
	రెండు రోజులు గిరాకీ
	బతుకమ్మ మొదలైన రోజు, చివరి రోజు రెండు రోజులు చాలా గిరాకీ ఉంటుంది. ఏటా వచ్చి పూలు అమ్ముతాము. ఉదయం నుంచే గిరాకీ ఉంటుంది. చాలా మంది పూలు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వస్తున్నారు. పొద్దుపొడవక ముందు 4 గంటలకు గుట్ట ప్రాంతాలకు పోయి పూలు కోసుకుని వచ్చి..ఇక్కడ అమ్ముతాం.  
	– కుమార్, సైదాపూర్ 
	పూల ధరలు(సుమారుగా రూపాయలలో)
	తంగెడు కట్ట 10–15 
	గునుగు కట్ట 10–15 
	బంతిపూలు 50 గ్రాములు 20 
	చామంతి 50 గ్రాములు 20 
	గులాబీ 50గ్రాములు 20–30 
	చామంతి ఒకటి 5–10 
	పట్టుకుచ్చులు కట్ట 10–15
	గుమ్మడిపూలు ఒకటి 5–10
						