
తెలంగాణ ఆడపడుచుల్లో ‘బతుకమ్మ’ పండుగ ఆరోగ్యకాంతులను వెలిగిస్తోంది. బతుకమ్మ ఆడిన తర్వాత ‘సద్ది’ పేరుతో ‘ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ అతివలు ఫలహారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆటపాటలు, మానసికోల్లాసమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది.
బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’..
భారతీయ మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం పిల్లల్లోనూ ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల ఫలాహారాలను తయారు చేస్తారు. ఇందులో సత్తుపిండి, సద్ద ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు తదితర ఫలహారాలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు.. వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో తీరు పిండి వంట తయారు చేస్తుంటారు.
సద్దుల్లో పోషకాలు..
బతుకమ్మ ఉత్సవాలు వస్తే అందరికీ సద్ద ముద్దలు(సజ్జ ముద్దలు) గుర్తుకొస్తాయి. ఈ పేరుతోనే పెద్దబతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు వచి్చందని చెబుతారు. సందె వేళలో చేసే బతుకమ్మ కాబట్టి.. సద్దుల బతుకమ్మ అంటారని మరో చరిత్ర. సజ్జలను పిండిగా పట్టించి బెల్లం కలిపి ముద్దలు చేస్తారు.
కొందరు వీటికి నెయ్యి కూడా కలుపుతారు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కార్పోహైడ్రేట్స్ తక్కువ. ప్రొటీన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి బెల్లం కలపడంతో ఐరం శాతం పెరిగి మహిళల రుతుక్రమ సమస్యల నివారణ, గొంతు నొప్పి తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
నువ్వుల ముద్దలు..
బతుకమ్మ పండుగలో నువ్వులు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో ఎమినోయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మెదడును చురుకుగా ఉంచుతుంది. కాల్షియం ఎమకల దృఢత్వాన్ని పెంచుతుంది.
పెసర ముద్దలు..
పెసళ్లను ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తాయి.
కొబ్బరి పొడి...
కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
పెరుగన్నం, పులిహోర...
పెరుగన్నం, పులిహోర ఇటీవల సద్దిగా ఇస్తున్నారు. పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలు కలుపుతున్నారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర కూడా ప్రసాదంగా వాడుతున్నారు. దేశంలో దాదాపు 6 వేల ఏళ్లుగా పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా.. పంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.
చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పెరుగులో పోషక విలువలు మెండు. అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బి –6, బి12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్తో బసిల్లె అధికంగా ఉంటుంది. అపెండిసైటీస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ నిరోధక శక్తిని పెంచుతుంది.
పల్లిపిండి..
పల్లిపిండి శరీర ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది. అధిక ప్రొటీన్లతోపాటు రుచికరంగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో పోషకాలూ లభిస్తాయి.
పోషకాలు పుష్కలం
బతుకమ్మ పండుగకు తయారు చేసే సత్తుపిండిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. రుచికరంగా ఉండే సత్తుపిండి పిల్లలకు ప్రొటీన్స్ అందిస్తాయి. కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల ఎదుగుదల.. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. సంప్రదాయ పిండివంటలను ప్రతీఒక్కరు తినాలి. బతుకమ్మ ఆరోగ్యాన్ని పంచే ప్రత్యేకమైన పండుగ.
– దండె రాజు, ఆర్‌ఎంవో, గోదావరిఖని జీజీహెచ్