
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ.. ఆట చిలుకలార గౌరమ్మ.. పాట చిలుకలార గౌరమ్మ.. అంటూ సాంస్కృతిక నగరమైన హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాల సందడి మొదలైంది.. నేటి (ఆదివారం) నుంచి.. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. వాడవాడలా పూల గోపురాల హడావుడి మొదలైంది. పలు ప్రాంతాల్లోని ప్రాంగణాల్లో పండుగ సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.. విద్యుత్ దీపాల వెలుగులతో ప్రత్యేక అలంకరణ చేసింది..ప్రధాన కూడళ్లు మొదలు.. చెరువులు, కుంటలు ఉత్సవాలకు వేదికలు కానున్నాయి..
పూలపండుగకు మహానగరం సన్నద్ధమైంది. బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు ఎల్‌బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ వెలుగులతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించారు.
సాధారణ మహిళల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకూ అన్ని వర్గాల వారూ వేడుకల్లో భాగస్వాములయ్యే విధంగా ఏర్పాట్లు చేపట్టింది. గ్లోబల్‌సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ సాంస్కృతిక నగరంగా కూగా ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉంది. నిజాం కాలం నుంచే నగరంలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
వైవిధ్యభరితమైన సంస్కృతుల పాదులాంటి భాగ్యనగరంలో శతాబ్దాల క్రితమే అందమైన బంతిపూల బతుకమ్మలు, నూటొక్కతీరు పూల బతుకమ్మలు కొలువుదీరాయి. అప్పట్లో ప్రతి సంవత్సరం స్వచ్ఛంగా, నిండుగా ప్రవహించే మూసీనది ఒడ్డున ఎంగిలిపూల బతుకమ్మలు మొదలుకొని సద్దుల బతుకమ్మల వరకూ తొమ్మిది రోజుల పాటు మహిళలు వేడుకలను నిర్వహించేవారు. దీంతో మూసీనది పరీవాహక ప్రాంతమంతా నిలువెత్తు
శతాబ్దాల చరిత్ర..
ఇంద్రధనస్సు నేలపై పరుచుకున్నట్లు అందంగా తళుకులీనుతూ కనువిందు చేసేది. వందలాది చెరువులు, కుంటలతో, అందమైన ఉద్యానవనాలతో కూడిన భాగ్యనగరానికి బతుకమ్మ పండుగ మొదటి నుంచి బంగారు కాంతులద్దింది. కుతుబ్‌షాహీల కాలం నుంచే హైదరాబాద్‌లో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ చేసుకున్నారు. అప్పటి రాజు ఇబ్రహీం కులీకుతుబ్‌షాను పొగుడుతూ మహిళలు పాడుకున్న బతుకమ్మ పాటలే ఇందుకు నిదర్శనమని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి తెలిపారు. ఆ తరువాత నిజాం కాలం నాటికి బతుకమ్మ పండుగ మరింత వైభవోపేతంగా జరిగింది.
ప్రకృతి ఉత్సవం..
పెత్తరమవాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ ఆఖరు రోజు నవమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, ముత్యాలపూలు, కట్ల పువ్వులు, తీగెమల్లె పువ్వులు, డిసెంబరాలు వంటి పూలతో అమ్మాయిలు బతుకమ్మలను పేర్చుతారు.
ఇంట్లో అమ్మాయిల వయసుకు తగిన విధంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బతుకమ్మ ఎత్తు పెంచుకోవడం, తమ స్థాయికి తగిన విధంగా పెద్ద పెద్ద బతుకమ్మలను అలంకరించుకొనే సంప్రదాయం నగరంలో బలంగానే ఉంది. కూకట్‌పల్లి, మియాపూర్, తదితర చోట్ల ఏటా బాహుబలి బతుకమ్మలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సారి ఎల్‌బీస్టేడియంలోనూ అతిపెద్ద బతుకమ్మను అలంకరించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేపట్టింది.
సద్దుల సమర్పణ..
సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి తృణధాన్యాలు, బెల్లంతో మలీద ముద్దలు చేసి సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మకు సద్దులు సమరి్పస్తారు. బతుకమ్మ పండుగ రోజున పసుపుతో చేసిన గౌరమ్మను పూలమధ్యలో అలంకరించి పూజిస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాస దీక్షలో మహిళలు బతుకమ్మ పండుగ అనంతరం తాము తెచ్చిన సద్దులు ఆరగించి దీక్ష విరమిస్తారు.
నిలువెత్తు పూలగోపురాల్లా, ఎత్తయిన పూల శిఖరాల్లా రంగురంగుల పూలతో ఎంతో అద్భుతంగా కనిపించే బతుకమ్మ ఇక్కడి ప్రజలకు ఆరాధ్యం. ‘బతుకమ్మ’ అంటే బతుకును ఇచ్చే తల్లి అని అర్థం. ఆ మాటకొస్తే కాకతీయుల కాలంలో పోరుభూమిలో ఉన్న రాణి రుద్రమ దేవిపై శతృవు కత్తి దూసినప్పుడు ఓ మహిళ అడ్డంగా వెళ్లి ఆమె ప్రాణాలు కాపాడి బతుకునిచి్చందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలా అనేక శతాబ్దాలుగా తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ఆది నుంచి వేదికగా నిలిచింది.
మూసీనది ఒడ్డున..
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ మహిళలు పాడుకునే పాటలతో తొమ్మిది రోజుల పాటు నగరంలో సందడి కనిపించేది. ఈ వేడుకలకు నిజాం నవాబులు తగినవిధంగా ఏర్పాట్లు చేసేవారు. పండుగ సందర్భంగా చెరువులు, కుంటల వద్ద, మూసీనది ఒడ్డున మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకొనేవారు.
మహబూబ్ అలీఖాన్ కాలంలో హిందువుల పండుగలకు అనూహ్యమైన ఆదరణ, ప్రాచుర్యం లభించాయి. మూసీనది వరదలు పోటెత్తి నగరాన్ని అతలాకుతలం చేసినప్పుడు, ఎంతోమంది ఆ వరదల్లో విగత జీవులయ్యారు. ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. ‘తళతళ మెరుపులు మెరవంగా ఉయ్యాలో, పెళపెళ పిడుగులు రాలంగా ఉయ్యాలో, కురిసింది వాన ఉయ్యాలో.. పట్నంబులోన ఉయ్యాలో.. పొంగిందీ మూసీ ఉయ్యాలో.. మునిగిందీ ఊరు ఉయ్యాలో..’ అంటూ ఆ నాటి విషాదాన్ని పాటల రూపంలో పాడుకున్నారు.
(చదవండి: బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం: ఉత్సవాల షెడ్యూల్ ఇదే!)