దిగంబర కవులకు సత్కారం

దిగంబర కవులు నిఖిలేశ్వర్, భైరవయ్య, నగ్నముని, జ్వాలాముఖి, చెరబండరాజు, మహాస్వప్న (ఫైల్‌) - Sakshi

ఆదివారం దిగంబర కవిత్వ సంపుటాల ఆవిష్కరణ

 

దిగంబర కవిత్వానికి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం తెనాలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ‘తెలుగు కవితా సమాలోచన’లో పలువురు ప్రముఖులు దిగంబర కవులు నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్, భైరవయ్యను సత్కరించనున్నారు. దిగంబర కవిత్వానికి 50 సంవత్సరాలు పేరుతో మూడు సంపుటాల సంయుక్త సంచికను ఇదే వేదికపై ఆవిష్కరిస్తారు. జూపల్లి ప్రేమ్‌చంద్‌ రచన ‘ధిక్కారవాదం– దిగంబర కవిత్వం’ పుస్తకావిష్కరణ చేస్తారు. 

 

తెనాలి: పోరాటాలతో దక్కించుకున్న స్వాతంత్య్రం అనంతరం 1965 ప్రాంతంలో దేశంలో దిగజారిన పరిస్థితులపై గొంతెత్తి కటువైన పదజాలంతో నినదిస్తూ రాష్ట్రంలో దిగంబర కవిత్వం రూపుదిద్దుకొంది. ఆకలి, దారిద్య్రం, చదువుకున్నవారికి ఉద్యోగాల్లేపోవడం, కులవృత్తుల ధ్వంసం, అవినీతి, బంధుప్రీతి అలముకున్న తీరు ఇందుకు దారితీసింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, వివిధ వృత్తులోనూ ప్రవృత్తిరీత్యా కవులుగా ఉన్న యాదవరెడ్డి, మానేపల్లి హృషీకేశవరావు, బద్దం భాస్కరరెడ్డి, వీరరాఘవాచార్యులు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మన్మోహన్‌ సహాయ్‌ అనే ఆరుగురు, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య పేర్లతో దిగంబర కవులుగా అవతరించారు. ‘ఒంటిమీది గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది/ ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది’ అనే గీతంలో దిగంబర కవుల ఆక్రోశం కనిపిస్తుంది. అప్పట్లో ఈ కవిత్వం ఒక సంచలనం. ప్రభుత్వానికి కంటగింపు కూడా..

 

అరెస్టు చేసి జైలుకు పంపారు..

1971 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీరిలో నిఖిలేశ్వర్,  చెరబండరాజు, జ్వాలాముఖిని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద అరెస్టుచేసి ముషీరాబాద్‌ జైలుకు పంపింది. సాహిత్యం ద్వారా వర్గపోరాటాన్ని రెచ్చగొట్టటం, పోరాటంలో నిర్భయంగా మృత్యువును ఎదుర్కోమని ఉద్భోదించారు. విద్యార్థుల, పౌరహక్కుల, విప్లవ రచయితల సభల్లో ప్రసంగించారంటూ...నేరారోపణలతో చార్జిషీట్లు తయారుచేశారు. దీనిపై కవితాలోకంలో నిరసన పెల్లుబికింది. తమ సాహిత్య రాజకీయ విశ్వాసాలను వివరిస్తూ వీరు నిర్బంధాన్ని కోర్టులో సవాల్‌ చేశారు. 1971 సెప్టెంబరు 20న హైకోర్టు బెంచి విచారణ జరిపి ఇరువైపుల వాదనలు విన్నారు. పోలీసులు వీరు రాసిన కవితలపైనా నేరారోపణ చేసినందున, న్యాయమూర్తులు వీరి కవితలను చదవమని ఆదేశించారు. కిక్కిరిసిన కోర్టు హాలులో ఈ ముగ్గురూ కవితా పఠనం చేయడం, ప్రతిస్పందనగా కరతాళధ్వనులు మోగటం విశేషం. దీనిపై బెంచి తరఫున తీర్పు వెలువరించిన జస్టిస్‌ చిన్నపరెడ్డి, ‘కవిత్వం చీకటిలోంచి వెలుగులోకి నడిపించే ప్రక్రియగా కవుల సంఘర్షణలోంచి వెలువడుతుంది...ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం లేదని కేసు  కొట్టివేస్తున్నట్టు చెబుతూ ముగ్గురూ స్వేచ్ఛాజీవులుగా కోర్టునుంచే వెళ్లవచ్చని తీర్పు చెప్పారు. న్యాయవాదులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, కేజీ కన్నభిరన్‌లు వీరి తరఫున ఉచితంగా వాదించారు. జస్టిస్‌ చిన్నపరెడ్డి తీర్పు, ఆ తర్వాత విరసం నినాదంగా ‘కలాలకు సంకెళ్లు లేవు...విశ్వాసాలు విశ్వవ్యాప్తం’ అనే ఉత్తేజాన్ని నింపింది. రచయితల వాక్‌స్వాతంత్య్రాన్ని కాపాడిన ఈ సంఘటనలో ప్రత్యక్ష పాత్రధారి అయిన నిఖిలేశ్వర్‌ జ్ఞాపకమిది.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top