‘టీడీపీ పెద్దలతో అంటకాగుతున్న ఒకరిద్దరు నాయకుల వల్ల ఏపీలో పార్టీ బలహీనపడుతోంది.
- టీడీపీతో అంటకాగుతున్న ఫలితమిదీ..
- బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుల ఆవేదన
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ‘‘టీడీపీ పెద్దలతో అంటకాగుతున్న ఒకరిద్దరు నాయకుల వల్ల ఏపీలో పార్టీ బలహీనపడుతోంది. నాయకత్వ తీరుకు తోడు టీడీపీ ప్రభుత్వం నుంచి వస్తున్న అవమానాలతో జిల్లాల్లో తిరగలేకపోతున్నాం. కార్యకర్తలకే కాదు.. మాకూ ఎలాంటి పనులు జరగట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’’ అంటూ పలు జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో తక్షణమే పార్టీ నాయకత్వ మార్పు జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశం పార్టీ రాష్ర్టశాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు అధ్యక్షతన విశాఖలో శనివారం జరిగింది.
జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్, బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.సతీష్‌జీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి డి.పురందేశ్వరి, రాష్ర్ట మంత్రి కామినేని శ్రీనివాస్, సీనియర్ నేతలు పి.వి.చలపతిరావు, సీహెచ్ రామచంద్రారెడ్డి, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ర్టంలో పార్టీ పరిస్థితి, టీడీపీతో సంబంధాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడంపై చర్చ జరిగింది. టీడీపీతో పొత్తు నేపథ్యంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు.