వేరుశనగకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

వేరుశనగకు బ్రేక్‌

Published Sun, Sep 3 2017 9:55 PM

వేరుశనగకు బ్రేక్‌ - Sakshi

- 32 సంవత్సరాల తర్వాత తగ్గిన విస్తీర్ణం
– 1985 తర్వాత 3.65 లక్షల హెక్టార్లకే పరిమితం
– 1960 నుంచి 1985 వరకు చిరుధాన్యాలదే పైచేయి


అనంతపురం అగ్రికల్చర్‌: ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జిల్లాలో వేరుశనగ పంట విస్తీర్ణం తగ్గింది. ఇది మంచికా చెడుకా అని పక్కన పెడితే ఈ సారి పంటల సాగులో వైవిద్యం కనిపించే అవకాశం ఉంది. వేరుశనగతో పాటు కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, కొర్ర, రాగి, పెసర, అలసంద, ఉలవ లాంటి ప్రత్యామ్నాయ పంటలు కొంతవరకు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా పంటల సాగు రైతులకు ఎంత వరకు ఉపకరిస్తుందనేది వేచిచూడాలి.

దెబ్బతీసిన జూలై
జూన్, జూలైలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల 6.04 లక్షల హెక్టార్లకు గానూ వేరుశనగ విస్తీర్ణం 3.65 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. జిల్లా చరిత్రలో 1985 తరువాత సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఇదే తొలిసారి. ఇటీవల కాలంలో 2009లో 5.10 లక్షల హెక్టార్లు, 2015లో 4.44 లక్షల హెక్టార్లలో పంట వేశారు. 1985 సంవత్సరానికి ముందు వేరుశనగ కన్నా ప్రత్యామ్నాయ పంటలే ఎక్కువ వేసేవారు. కాలక్రమేణా వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల వాణిజ్య పంటగా అవతరించిన వేరుశనగ 1986 నుంచి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. 1995లో ఏకంగా 8.78 లక్షల హెక్టార్ల అత్యధిక విస్తీర్ణం పంట సాగు చేశారు. అలా పెరుగుతూ వచ్చిన వేరుశనగ 1990 తర్వాత జిల్లా రైతులతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకుని ఏకపంటగా విస్తరించింది. వేరుశనగ లేనిదే ‘అనంత’ వ్యవసాయం లేదనే స్థాయికి చేరుకుంది.

స్పష్టత లేని ప్రత్యామ్నాయం
జూన్, జూలైలో నెలకొన్న వర్షాభావం వల్ల ఖరీఫ్‌ సాగు నిరాశాజనకంగా సాగుతోంది. ప్రత్యామ్నాయ పంటలు ఏ మేరకు వేస్తారనేదానిపై ఇంకా అంచనాకు రాలేకపోతున్నారు. దాదాపు 30 మండలాల్లో వేరుశనగ పంట విస్తీర్ణం సాధారణం కన్నా 50 శాతం తక్కువగా వేశారు.  ఇప్పటివరకు అయితే కంది 44 వేల హెక్టార్లు, ప్రత్తి 25 వేల హెక్టార్లు, మొక్కజొన్న 10 వేల హెక్టార్లు, ఆముదం 7 వేల హెక్టార్లు, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఉలవ, పెసర, అలసంద తదితర అన్ని పంటలు కలిపి ఒక లక్ష హెక్టార్లలో వేశారు. ఆగస్టు చివరి వారంతో పాటు సెప్టెంబర్‌లో ఏ మేరకు పంటలు సాగులోకి వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. వ్యవసాయశాఖ ఐదు లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేస్తారని అంచనా వేసినా అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2 నుంచి 2.50 లక్షల హెక్టార్లలో వేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నా తెగుళ్ల భయంతో వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది.

గతంలో చిరుధాన్యాలదే పైచేయి
1960 నుంచి 1985 వరకు  జిల్లాలో చిరుధాన్యపు పంటల హవా కొనసాగింది.  ఆరికలు, సాములు, జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జ పంటలు విపరీతంగా పండించేవారు. 1960కు ముందు కూడా ఈ పంటలే పూర్తీస్థాయిలో వేసేవారు. 1961–62లో చిరుధాన్యపు పంటలు 5.55 లక్షల హెక్టార్లలో వేయగా, వేరుశనగ కేవలం 1.94 లక్షల హెక్టార్లలో వేశారు. 1971–72లో చిరుధాన్యాలు 4.01 లక్షల హెక్టార్లు కాగా వేరుశనగ 2.55 లక్షల హెక్టార్లలో వేశారు. 1981–82 లో చిరుధాన్యపు పంటలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ పంటలు 3 లక్షల హెక్టార్లు కాగా వేరుశనగ విస్తీర్ణం 3.74 లక్షల హెక్టార్లకు పెరిగింది. 1991–92కు వచ్చే సరికి వేరుశనగ జాతర మొదలైంది. చిరుధాన్యపు పంటలు కేవలం 60 వేల హెక్టార్లు కాగా వేరుశనగ ఒక్కసారిగా 7.35 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. ఇప్పుడిప్పుడే కాస్తంత బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement
Advertisement