కార్డన్ సెర్చ్లో..నోరెళ్లబెట్టిన పోలీసులు | Every home in the theft of equipment | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్లో..నోరెళ్లబెట్టిన పోలీసులు

Aug 3 2016 10:06 AM | Updated on Sep 4 2017 7:30 AM

కార్డన్ సెర్చ్లో..నోరెళ్లబెట్టిన పోలీసులు

కార్డన్ సెర్చ్లో..నోరెళ్లబెట్టిన పోలీసులు

అమృతాపూర్‌ పంచాతీయ పరిధిలో గల ఒడ్డెర కాలనీ, దేవునగర్‌ లెప్రసీ క్యాంపులో పోలీసులు మంగళవారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

డిచ్‌పల్లి(నిజామాబాద్): మండలంలోని అమృతాపూర్‌ పంచాతీయ పరిధిలో గల ఒడ్డెర కాలనీ, దేవునగర్‌ లెప్రసీ క్యాంపులో పోలీసులు మంగళవారం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన తనిఖీలు ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. నిజామాబా ద్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో డిచ్‌పల్లి  సీఐ తిరుపతి, ఎస్సైలు కట్టా నరేందర్‌రెడ్డి, శ్రీదర్‌గౌడ్, ము రళి, ప్రొబేషనరీ ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై గంగారాం, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు.

ఈ సందర్భంగా లభించిన సామగ్రిని చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. దాదాపు ప్రతి ఇంట్లో క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల (సీఎంసీ)కు చెందిన సామగ్రి లభించడంతో విస్తుబోయారు. కళాశాలలోని మంచాలు, టేబుళ్లు, బెంచీలు, ఫ్రిజ్‌లు, బీరువాలు, సీలింగ్‌ఫ్యాన్లు ఆ ఖరికి పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన బెడ్‌లు లభించడంతో సిబ్బంది విస్మయానికి గురయ్యారు. కొందరైతే అవసరం లేకున్నా గదులకు ఉన్న తలుపులు ఎత్తుకొచ్చి ఇళ్లల్లో దాచుకున్నారు.

సామగ్రిని ఐదు ట్రాక్టర్లలో తరలించి విక్టోరియా హాస్పిటల్‌ ఆవరణలోని భవనంలో ఉంచారు. పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్‌ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శక్తులను అరికట్టేందుకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఇంట్లో సీఎంసీ కళాశాలకు చెందిన సామాగ్రి లభించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. త్వరలో మరోసారి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తామని, చోరీ చేసిన సామాగ్రి లభిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలు నమోదు చేసుకుని సీఎంసీ ప్రతినిధులకు అప్పగిస్తామని తెలిపారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement