దుబాయ్ టు పాతబస్తీ | Dubai to patabasti | Sakshi
Sakshi News home page

దుబాయ్ టు పాతబస్తీ

Nov 5 2015 12:41 AM | Updated on Aug 21 2018 5:52 PM

దుబాయ్ టు పాతబస్తీ - Sakshi

దుబాయ్ టు పాతబస్తీ

కస్టమ్స్ నిబంధనల్ని తమకు అనుకూలంగా మార్చుకుని దుబాయ్ నుంచి పాతబస్తీకి పక్కా ‘లీగల్’గా బంగారాన్ని అక్రమ రవాణా

♦ దర్జాగా బంగారం అక్రమ రవాణా
♦ లీగల్‌గానే పక్కా ఇల్లీగల్ వ్యవహారం
♦ వ్యవస్థీకృతంగా  ముఠా కార్యకలాపాలు
♦ నగరంలో నలుగురి అరెస్టు, 4 కేజీల పసిడి స్వాధీనం
 
 సాక్షి, హైదరాబాద్: కస్టమ్స్ నిబంధనల్ని తమకు అనుకూలంగా మార్చుకుని దుబాయ్ నుంచి పాతబస్తీకి పక్కా ‘లీగల్’గా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ అంతర్జాతీయ గ్యాంగ్‌లో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసి 4.19 కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఓల్డ్ మలక్‌పేటకు చెందిన మహ్మద్ తాహెరుద్దీన్ అలియాస్ ఆసిఫ్ గతంలో వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థలో పని చేశాడు. దుబాయ్, సౌదీలతో పోలిస్తే భారత్‌లో బంగారం ధరలు, అక్రమ రవాణా ద్వారా విక్రయిస్తే కలిగే లాభాలపై పట్టు సాధించాడు. బంగారం స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకుని.. చాదర్‌ఘాట్‌కు చెందిన జఫార్ అహ్మద్, తీగల్‌కుంటకు చెందిన సయ్యద్ వజీద్, మీర్‌చౌక్‌కు చెందిన ఆరిఫ్ అలీ షేక్, దుబాయ్‌లో స్థిరపడిన హసన్‌నగర్ వాసి మహ్మద్ ఫెరోజ్ ఖాన్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు.

 నిబంధనల్ని అనుకూలంగా మార్చుకుని..
 కస్టమ్స్ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం దుబాయ్‌లో ఉండి వస్తున్న భారతీయులు కొంత మొత్తం బంగారాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. దీన్ని ఈ గ్యాంగ్ పూర్తిగా వాడుకుంది. దుబాయ్‌లో 100 నుంచి 150 గ్రాముల బంగారం బిస్కెట్లను ఫెరోజ్ ఖరీదు చేసి.. వాటితో విమానాశ్రయానికి చేరుకునేవాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే పేదలు, మధ్యతరగతి వారిని విమానాశ్రయంలోనే గుర్తించేవాడు. వేషధారణ, ప్యాక్ చేసిన లగేజీ ఆధారంగా వీరిని పసిగట్టేవాడు. వారితో మాటలు కలిపి కస్టమ్స్ నిబంధనలు చెప్తూ రెండు బిస్కెట్లు తీసుకెళ్లాలని కోరు తూ.. రూ.10 వేల నుంచి 15 వేల కమీషన్ ఆశ చూపేవాడు. ఈ రకంగా కన్‌సైన్‌మెంట్ పంపాల్సిన ప్రతిసారీ విమానాశ్రయంలోనే 10 నుంచి 15 మందిని గుర్తించడం ద్వారా నాలుగైదు కేజీల బంగారాన్ని లీగల్‌గా అక్రమ రవాణా చేసేవాడు. వీరిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసినా పరిమిత మొత్తమే ఉండటంతో అభ్యంతరం చెప్పే వారుకాదు.

 ఇక్కడ కలెక్ట్ చేసుకుంటూ..
 ఏ విమానాల్లో, ఎవరెవరు బంగారం తీసుకువస్తున్నారనే సమాచారాన్ని ఫెరోజ్ ముఠాకు పంపేవాడు. ఆరిఫ్ షేక్ విమానాశ్రయంలో కాపుకాసి.. జఫార్, వాజిద్ సాయంతో క్యారియర్లను రిసీవ్ చేసుకుని బంగారం తీసుకునేవారు. దానిని తాహెరుద్దీన్‌కు అప్పగించి హోల్‌సేలర్లతో పాటు ఇతర వ్యక్తులకూ డిస్కౌంట్‌పై అమ్మి సొమ్ము చేసుకునేవారు. కేజీ బంగారంపై గరిష్టంగా రూ.ఆరు లక్షలు లాభం ఉండేది. రూ.లక్ష నుంచి 2 లక్షలు కమీషన్లు పోయినా.. మిగిలినది వీరు పంచుకునే వారు. ఫెరోజ్‌కు అతడి వాటాతో పాటు బంగారం ఖరీదుకు అవసరమైన సొమ్మును హవాలా మార్గంలో పంపేవారు.
 
 మూడు నెలల నుంచి యథేచ్ఛగా..
 గత మూడు నెలల నుంచి ఈ ముఠా యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేసింది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వివిధ విమానాల్లో వచ్చిన బంగారాన్ని రిసీవ్ చేసుకుని విక్రయించడం ప్రారంభిం చింది. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సుఖ్‌దేవ్‌సింగ్ తన బృందంతో వలపన్ని ఫెరోజ్ మినహా నలుగురినీ అరెస్ట్ చేశారు. బంగారం బిస్కెట్లపై ‘ఏఆర్‌జీ-యూఏఈ-10 తులాస్-999.0-ఏఆర్‌జీ-మెల్టర్ ఎసయ్యర్’ అనే ముద్రను బట్టి అంతర్జాతీయ మార్కెట్‌కు చెందినదిగా నిర్థారించారు. వీరి నుంచి 4.19 కేజీల బంగారం, రూ.16 లక్షలు, 2,500 రియాల్స్, 910 దీరమ్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)కు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement