గుక్కెడు నీరివ్వలేరా? | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీరివ్వలేరా?

Published Tue, Apr 18 2017 12:28 AM

గుక్కెడు నీరివ్వలేరా?

  •  బాలయ్య తీరు దారుణం
  • ఎంపీ నిమ్మల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్టించుకోరు
  • సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, విపక్ష నేతలు
  • హిందూపురం అర్బన్‌ : ప్రజలకు గుక్కెడు తాగునీరు ఇవ్వలేని చేతకాని పాలకులు ఉన్నారంటే సిగ్గుచేటని సామాజిక హక్కుల రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు.  పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించాలంటూ సోమవారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు ఆందోళన చేశారు. స్థానిక రహమత్‌పురం నుంచి ఖాళీ బిందెలతో ర్యాలీగా తరలివచ్చి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సీపీఐ కౌన్సిలర్‌ దాదాపీర్‌ అధ్యక్షతన «బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో 35 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలే పాలిస్తున్నా నీటి సమస్యకు శాశ్విత పరిష్కరం చూపకపోవడం దారుణమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు నియోజకవర్గానికి వచ్చే తీరికలేదు..ఎంపీ నిమ్మలకిష్టప్ప అసలు ఇటు వైపు కన్నెత్తి చూడరు..స్థానికంగా ఉండే చైర్‌పర్సన్‌ కమీషన్ల కోసం కమిషనర్‌తో గొడవలు పడటానికే సరిపోయిందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరునెలలుగా కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారంటే ఎంత సిగ్గుచేటన్నారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జాఫర్‌ మాట్లాడుతూ మండుతున్న ఎండలో వందలాది మంది ప్రజలు ఖాళీ బిందెలతో మున్సిపల్‌ ఆఫీసు వద్దకు వస్తే అడిగేవారే లేకపోవడం దారుణమన్నారు. అధికారులు, పాలకులపై ప్రజలు తిరగబడే పరిస్థతి వచ్చిందన్నారు. అనంతరం మున్సిపల్‌ ఆఫీసు ఎదుట మట్టికుండలు పగులగొట్టి నినాదాలు చేశారు. డీఈ వన్నూరప్పకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇందాద్, బీఎస్పీ శ్రీరాములు, ఓపీడీఆర్‌ శ్రీనివాసులు, సీపీఐ నాయకులు సురేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement