‘దివీస్’కు వ్యతిరేకంగా ఐక్యపోరాటం
తొండంగి మండలం పంపాదిపేట, కొత్తపాకలు గ్రామాల్లో దివీస్ ఔషధ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దీనిని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడతామని ప్రతినబూనారు. అన్నవరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) కేంద్ర కమిటీ నాయకులు బుగతా బంగార్రాజు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి వైఎస్సార్‌సీప
-
రౌండ్‌టేబుల్ సమావేశంలోఅఖిలపక్ష నేతల తీర్మానం
-
6వ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు
-
అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
అన్నవరం :
తొండంగి మండలం పంపాదిపేట, కొత్తపాకలు గ్రామాల్లో దివీస్ ఔషధ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దీనిని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడతామని ప్రతినబూనారు. అన్నవరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) కేంద్ర కమిటీ నాయకులు బుగతా బంగార్రాజు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి వైఎస్సార్‌సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుని నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ అరాచక పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. అమాయక ప్రజలను, రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిని వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. దివీస్ పరిశ్రమ పెట్టే గ్రామాల్లో ప్రజలకన్నా పోలీసులే అధికంగా కనిపిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దివీస్ పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకుని తీరతామని అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నెల ఆరో తేదీన పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. బాధిత గ్రామాల ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు మాట్లాడుతూ, బలవంతపు భూసేకరణను అడ్డుకుని తీరతామని అన్నారు. ఉద్యమకారులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు అధికారులు వంత పాడడం సరి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ పాండురంగారావు మాట్లాడుతూ, కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు పి.నరసింహరావు, కార్యదర్శి అప్పారెడ్డి, జనశక్తి నాయకుడు కె.వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.