
పంచాయతీలకు ప్రోత్సాహకాలు
ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.
♦ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్
♦ బహిరంగ మలవిసర్జన నిర్మూలన ప్రాంతంగా గజ్వేల్
♦ అధికారికంగా ప్రకటించిన మంత్రి
♦ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు సన్మానం
గజ్వేల్: ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. హరితహారంతోపాటు ఇంకు డు గుంతల నిర్మాణం, పారిశుద్ధ్యలోప నివారణలో శ్రద్ధ చూపే పంచాయతీలకు వీటినిఅందిస్తామన్నా రు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నిర్మూలన(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నా రు. గురువారం సాయంత్రం మెదక్ జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు డోలు వాయించి... బహిరంగ మలవిసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) ప్రాంతంగా అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నంబర్‌వన్ నియోజకవర్గంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించడంతో సంబరపడిపోకుండా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించేలా చొరవచూపాల న్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి చొరవ చూపే పంచాయతీలకు నిధులు కేటాయించే విషయంలో ప్రాధాన్యతనిస్తామన్నారు. గజ్వేల్‌ను పొగరహిత నియోజకవర్గంగా ప్రకటిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందేలా చూస్తామన్నారు. గ్యాస్ కనెక్షన్లు లేనివారి జాబితాను పంచాయతీల వారీగా రూపొందించి ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుకు అందించాలన్నారు.
మారుతున్న గజ్వేల్ రూపురేఖలు
కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువనుందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఖర్చు పెడుతున్న పైసా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని అందరి దృష్టి గజ్వేల్‌పైనే కేంద్రీకృతమైందన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడి ప్రజలు ప్రతి అంశంలోనూ బాధ్యతాయుతంగా మెలగాలని ఆకాంక్షించారు. పంచాయతీలకు కొత్తరూపు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం
ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ అన్నారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జేసీ వెంకట్రాంరెడ్డి, ఎమ్మె ల్సీ ఫారూక్ హుస్సేన్, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణభూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గజ్వేల్ నగర పంచాయతీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్‌ను సాధించిన ప్రజాప్రతినిధులందరినీ సన్మానించారు.