మళ్లీ మారనున్న ఏపీ రాజధాని డిజైన్లు | design of the Amaravati: minister Narayana discuss with leading architect companies | Sakshi
Sakshi News home page

మళ్లీ మారనున్న ఏపీ రాజధాని డిజైన్లు

May 9 2016 1:35 PM | Updated on Aug 18 2018 8:08 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని డిజైన్లు మళ్లీ మొదటికే వచ్చినట్లు అయింది. మరోసారి రాజధాని డిజైన్లు మారనున్నాయి.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని డిజైన్లు మళ్లీ మొదటికే వచ్చినట్లు అయింది. మరోసారి రాజధాని డిజైన్లు మారనున్నాయి. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం జపాన్ రూపొందించిన డిజైన్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

ప్రముఖ ఆర్కిటెక్ట్స్ సంస్థలతో మంత్రి నారాయణ సోమవారం విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో సంప్రదింపులు జరిపారు. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు.

మొదట సింగపూర్ మాస్టర్ ప్లాన్ అని, ఆ తర్వాత జపాన్ కంపెనీకి సంబంధించి డిజైన్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ డిజైన్ లోని అసెంబ్లీ భవనాలు పొగగొట్టాల్లా ఉండడం, అదే తరహా అసెంబ్లీ భవనం చండీగఢ్‌లో ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడి డిజైన్లనే కాపీ కొట్టి జపాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి అన్నట్టు చూపించిందని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచలో పడింది.  ఇప్పటికే సింగపూర్, జపాన్ సంస్థల నుంచి డిజైన్లు తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా కొత్తగా మూడో డిజైన్ కోసం ప్రయత్నిస్తోంది. రాజధాని డిజైన్ల కోసం సింగపూర్ కంపెనీకి రూ.11 కోట్లు, జపాన్ సంస్థ మకీ డిజైన్కు రూ.కోటి ఖర్చు చేసింది. ఎంపిక తతంగానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, తీరా అది తుస్సుమనడంతో డిజైన్‌ను మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement